- ‘విజయవాడ’కు వెళ్లనీయకుండా అంగన్‌వాడీల అడ్డగింత
ప్రజాశక్తి -యంత్రాంగం : అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలు, అరెస్టులూ రెండోరోజు కొనసాగాయి. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ ఉత్తర్వులు సవరించాలని, 42 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో సోమవారం తల పెట్టిన మహాధర్నాకు వెళ్తున్న అంగన్‌వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రైళ్లు, బస్సుల్లో వెళ్తున్న వారిని అడ్డుకున్నారు. బస్సుల్లో నుంచి వారిని బలవంతంగా దించారు. విజయవాడకు వెళ్లబోమంటూ కాకినాడలో బలవంతపు సంతకాలు చేయించుకున్నారు. నిర్బంధాలు, అడ్డగింతలను నిరసిస్తూ తహశీల్దార్, ఆర్‌డిఒ, సిడిపిఒ, ఐసి డిఎస్ కార్యాలయాల వద్ద అంగన్‌వాడీలు నిరసనలు తెలి పారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
ఏలూరు కొత్త బస్టాండ్, ఏలూరు రైల్వే స్టేషన్లలో అంగన్‌వాడీలను నిర్బంధించడంతో పాటు కలపర్రు టోల్‌గేట్ వద్ద బస్సుల్లో విజయవాడ వెళ్తున్న వారిని బలవంతంగా కిందకు దించేశారు. దీంతో వారు కలపర్రు టోల్‌గేట్ వద్ద బైఠాయించి పోలీసుల చర్యలకు నిరసనగా నినాదాలు చేశారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లలో, చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌లో 60 మందిని పోలీసులు నిర్బంధిం చారు. సాయంకాలం వారిని విడిచిపెట్టారు. చింతలపూడి బోసుబొమ్మ సెంటర్లో అంగన్‌వాడీలు రాస్తారోకో నిర్వహిం చారు. పోలవరంలో ఏటిగట్టు వద్ద మానవహారం చేపట్టి నిరసన తెలియజేశారు. నిడమర్రు మెయిన్ రోడ్డులో నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది అంగన్‌వాడీలను పోలీసులు ఎక్కిడక్కడ అడ్డుకున్నారు. నిర్బంధాన్ని నిరసిస్తూ నరసాపురం స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకూ కళ్లకు నల్లగుడ్డ కట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో జాతీయ రహదారిపై బస్సులను తనిఖీ చేసి అంగన్‌వాడీలను బలవంతంగా కిందకు దించి చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌లో, కాకినాడ జిల్లా అన్నవరం, సామర్లకోట, కాకినాడలో పోలీసులు అడ్డుకున్నారు. ఐసిడిఎస్ సూపర్‌వైజర్లతో సమావేశం పేర తీసుకొచ్చి నిర్బంధించారు. విజయవాడకు వెళ్లబోమంటూ వారి నుంచి బలవంతంగా సంతకాలు చేయించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కాకినాడలో అంగన్‌వాడీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. శ్రీకాకుళంలో వాంబే కాలనీ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్‌డిఒలకు, తహశీల్దార్‌కు వినతిపత్రాలను అందజేశారు. వైఎస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని కడప, జమ్మలమడుగు, రైల్వేకోడూరు, సుండుపల్లెలో ఆర్‌డిఒ, సిడిపిఒ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. చిత్తూరులో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కార్వేటినగరంలో ఐసిడిఎస్ కార్యాలయం నుంచి మండల కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతపురం టవర్‌క్లాక్ వద్ద ఆందోళన చేపట్టారు. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులోని ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.