జనాభానుబట్టి సచివాలయాలు

  • వివిధ శాఖలకు సిబ్బంది సర్దుబాటు
  • పి4పై త్వరలో కాన్సెప్ట్‌ పేపర్‌
  • మీడియాతో చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయాలను జనాభా ప్రాతిపదికన నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపి కార్యాలయం లో శనివారం ఆయన ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు. సచివాలయాల పనితీరును మెరుగుపర్చడంతో పాటు, అందరికీ అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో వాటిని జనాభా ప్రాతిపదికన నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మార్పునకు అనుగుణంగా సిబ్బందిని కూడా సర్దుబాటు చేస్తామని, మిగులు సిబ్బందిని సంబంధిత శాఖలకు పంపుతామని చెప్పారు. దీనివల్ల సిబ్బంది సేవలను కూడా సమర్ధవంతంగా వినియోగించుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజల సమాచారాన్ని రియల్‌టైం మానిటరింగ్‌, అనాలసిస్‌ చేయడం ద్వారా మెరుగైన పాలన అందియ్యవచ్చని అన్నారు. ప్రజల డేటా ద్వారా ప్రతి ఇంటినీ యూనిట్‌గా చేసి, అందరికీ నేరుగా సంక్షేమ కార్యక్రమాలు, జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు చేపడతామన్నారు. పి-4 విధానంపై త్వరలో కాన్సెప్ట్‌ పేపర్‌ విడుదల చేస్తామని తెలిపారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ తమ లక్ష్యమని, దీనిలో భాగంగా గతంలో నిర్వహించిన హ్యాపీ సండే వంటి కార్యక్రమాలు మళ్లీ నిర్వహిస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి గుంతలు లేని రహదారుల పనులు పూర్తిచేసి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పిస్తామన్నారు. డ్రోన్‌, ఎఐ, ఐఓటి, సిసి కెమెరాలు, ఆధార్‌ వంటి వాటి ద్వారా ప్రభుత్వ సేవల్లో, ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల రాక ఉత్సాహానిస్తోందని, గ్రీన్‌ ఎనర్జీలో రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం గొప్ప ముందడుగు అని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంపై రాష్ట్రాన్ని మార్కెట్‌ చేసేందుకు దావోస్‌ పర్యటన ఉపయోగపడుతుందని వెల్లడించారు. కుప్పంలో ప్రతి ఇంటికి పిఎం సూర్యఘర్‌ కార్యక్రమం చేపట్టామని, రాష్ట్రమంతటా దీనిని విస్తరిస్తామని తెలిపారు. అనంతరం టిడిపి కార్యకర్తలు, ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచారు. అన్న క్యాంటీన్‌ నిర్వహణకు మొక్కపాటి శేషగిరిరావు, రాధాకృష్ణ రూ.1 లక్ష చొప్పున విరాళం అందించారు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలపై సమీక్ష నిర్వహించారు.

➡️