మతోన్మాదం దేశ సమైక్యతకు ప్రమాదం

  • అధికారం కోసం ప్రజల మధ్య బిజెపి చిచ్చు
  • సుందరయ్య స్మారకోపన్యాసంలో బివి రాఘవులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జాతీయ సమైక్యతకు మతోన్మాదం అత్యంత ప్రమాదకరమని సిపిఎం పొలిట్‌ బ్యూరోసభ్యులు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మన్‌ బివి రాఘవులు అన్నారు. మతోన్మాదానికి బిజెపి ప్రాతినిధ్యం వహిస్తోందని, దీని వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ుపరివార్‌ శక్తులు ఉన్నాయని చెప్పారు. మతం, కులం, రంగు, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తోందని చెప్పారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ‘దేశ సమైక్యత-ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై స్మారకోపన్యాసం మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం(ఎంబివికె) ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంబివికె ట్రస్ట్‌ చైర్మన్‌ పి మధు అధ్యక్షత వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే దేశసమైక్యతకు ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మతం, కులం, ప్రాంతం, రంగు వంటి అంశాలను ప్రస్తావించి ప్రజల మధ్య చిచ్చుపెట్టి తద్వారా ప్రస్తుత ఎన్నికల్లో లబ్ధిపొందాలని నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. మతానికి జనాభా పెరుగుదలకు సంబంధం లేదని, కానీ దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని అర్థం లేని ఆరోపణలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషం పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 140 కోట్ల జనాభాను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లలేని నరేంద్రమోడీ ప్రపంచాన్ని మించే సూపర్‌ పవర్‌గా దేశాన్ని ఎలా మారుస్తారని ప్రశ్నించారు.గతంలో దేశంలో విచ్ఛినవాదం వచ్చిందని, మరలా అలాంటి పరిస్థితులను చొప్పించాలని బిజెపి మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
మతం వ్యక్తిగత జీవితంలో తప్ప సామాజిక జీవితంలో ఉండకూడదని లౌకిక వాదాన్ని రాజ్యాంగంలో పొందుపరుచుకున్నామని వివరించారు. రాజ్యాంగాన్ని మార్చి లౌకికవాదం అనే పదం తొలగించి హిందూ రాజ్యంగా మార్చేందుకు బిజెపి 400 లోక్‌సభ సీట్లు అడుగుతుందన్నారు. లౌకికవాదం తొలగిస్తే దేశం ఐక్యంగా ఉండటం సాధ్యం కాదన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ఏకరూప పౌరస్మృతి, సిఎఎ వంటి చట్టాలను ఇప్పటికే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. రాజకీయాలను మతం శాసించాలనే మైనార్టీ సంస్థలు కూడా ఉన్నాయని అన్నారు. మెజార్టీ మతోన్మాదాన్ని చూపించి మైనార్టీలు లౌకికవాదం వైపు రాకుండా మతంవైపే ఉండేలా కొన్ని మైనార్టీ సంస్థలు రెచ్చగొడుతున్నాయని తెలిపారు. మెజార్టీ మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ మైనార్టీ మతోన్మాదాన్ని ప్రశ్నించాలని, అప్పుడే లౌకికవాదం సాధ్యమవుతుందన్నారు. ముస్లిం రిజర్వేషన్లను ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు కేటాయిస్తామని మోడీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కుల వ్యవస్థను రద్దు చేయాల్సిన ప్రధాని మోడీ కులతత్వాన్ని ప్రోత్సహించేలా ఉపన్యాసాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఏ రూపంలో నైనా మతోన్మాద అంశాలను ప్రోత్సహించినా అది జాతి ఐక్యతకు నష్టమన్నారు. హిందూ పేరుతో అదానీ, అంబానీ వంటి బడా కార్పొరేట్లకు దేశాన్ని అప్పగించేలా మోడీ ప్రయత్నిస్తున్నారనే, కార్పొరేట్‌ చేతుల్లో ఉన్న బడా మీడియా మోడీకి మద్దతుగా ఉన్నాయని చెప్పారు. భూ లావాదేవీలు ఎక్కడి నుంచైనా జరగాలనే ఆలోచనతో ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకొచ్చారని చెప్పారు. జగన్‌, చంద్రబాబు ఇద్దరూ మోడీ పక్కనే ఉన్నారని అన్నారు. జాతీయ సమైక్యత కోసం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించారని, లక్షలమంది త్యాగాలు చేశారని చెప్పారు. ఆ త్యాగాలను వృధ్ధా పోనివ్వకుండా కాపాడుకు నేందుకు పోరాడటమే సుందరయ్యకు నివాళులర్పించుకోవడం అని చెప్పారు. మధు మాట్లాడుతూ సుందరయ్య దేశ సమైక్యత కోసం తీవ్రమైన కృషి చేశారని చెప్పారు. మతం, కులం పేరుతో అనైక్యత సృష్టించే ప్రయత్నం రాష్ట్రంలో కూడా జరుగుతుందన్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా ప్రకటిస్తే అమలాపురంలో తీవ్రమైన అల్లర్లు జరిగాయని చెప్పారు. సామ్రాజ్యవాదానికి, వలస అధిపత్యానికి వ్యతిరేకంగా జాతీయ ఐక్యత ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబివికె కార్యదర్శి పి మురళీకృష్ణ, బాధ్యులు స్వరూపరాణి, క్రాంతికిరణ్‌, రామరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు ‘సేవ్‌ వాటర్‌’ పేరుతో విద్యార్ధులు ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది.

➡️