సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ రైలు 5 గంటలు ఆలస్యం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (20834) ఐదు గంటల ఆలస్యంగా బయల్దేరనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరాల్సిన ఈ రైలును రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్‌ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈమేరకు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. మామూలుగా అయితే, ఈ రైలు మధ్యాహ్నం 3 గంటలకే సికింద్రాబాద్‌లో బయల్దేరాల్సి ఉంది. అయితే, విశాఖలో ఈ ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన రైలు (20833) దాదాపు 5 గంటలు ఆలస్యం అయినట్లు సమాచారం. అదే రైలు సికింద్రాబాద్‌కు చేరుకొని తిరిగి విశాఖకు వెళ్లాల్సిఉండటంతో ఈ రైలును అధికారులు సికింద్రాబాద్‌లో రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్‌ చేసినట్లు తెలుస్తోంది. రైలు దాదాపు ఐదు గంటల పాటు ఆలస్యం కావడంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేక పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు, వేసవి రద్దీ దఅష్ట్యా ఏర్పాటుచేసిన పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. నిర్దేశిత తేదీల్లో నడుస్తోన్న ఈ ప్రత్యేక సర్వీసులను ఆయా స్టేషన్ల మధ్య మే 30 నుంచి జులై 1 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.

➡️