కార్పొరేట్లకు కేంద్రం ఊడిగం

  • మూడేళ్లలో రూ.12 లక్షల కోట్లు కట్టబెట్టారు
  • కేంద్ర బడ్జెట్‌పై సదస్సులో వి. శ్రీనివాసరావు

ప్రజాశక్తి – నెల్లూరు ప్రతినిధి : కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తోందని, తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ దీనిని రుజువు చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్జాన కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. పెట్టుబడిదారులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని, పరిశ్రమల పేరుతో భూములు తీసుకొని, మళ్లీ ఆ భూములు బ్యాంకుల్లోనే తాకట్టు పెట్టి దోచుకుంటున్నారని విమర్శించారు. మూడేళ్ల కాలంలో పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు రూ.12 లక్షల కోట్లు ఎగొట్టాయన్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల సోమరితనం పెరిగిందని ప్రచారం చేస్తున్నారని, అందులో ఏ మాత్రమూ వాస్తవం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా కల్పించకుండా ఏవేవో కథలు చెబుతోందన్నారు. బడ్జెట్‌లో మనకు ఏం ఇచ్చారో చెప్పలేని స్థితిలో టిడిపి, వైసిపి, జనసేన పార్టీలున్నాయన్నారు. కడప ఉక్కు ప్రస్తాన లేదని, రైల్వే జోన్‌ విషయంలో స్పష్టత లేదని తెలిపారు. విశాఖ ఉక్కు కోసం రూ 11,400 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారని, క్రమేపీ దీనిని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి కుట్ర జరుగుతోందన్నారు. విదేశీ కంపెనీలు వస్తాయని, రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని సిఎం చంద్రబాబునాయుడు రోజూ ఊరిస్తున్నారని అన్నారు. ఇటీవల దావోస్‌లో అంతర్జాతీయ సదస్సులో రాష్ట్రానికి ఒక్క ఒప్పందం కూడా జరగలేదన్నారు.

ప్రపంచంలోని చిన్న చిన్న దేశాలు అమెరికా విధానాలను వ్యతిరేకిస్తుంటే మోడీకి మాత్రం నోట మాట రావడం లేదన్నారు. ఎఫ్‌ 35 విమానాలకు కాలం చెల్లిందని, ఏడాది క్రితమే మస్క్‌ ఈ విషయం చెప్పారని, వీటిని భారత్‌కు అమెరికా అంటకట్టిందని వివరించారు. భారత్‌, అమెరికా వాణిజ్యంలో అమెరికా లోటులో ఉందన్నారు. 500 మిలియన్‌ డాలర్లు పెట్టి భారత్‌ ఈ ఏడాది ఆయిల్‌, ఆయుధాలు, గ్యాస్‌ కొనుగోలు చేస్తుందన్నారు. భారత్‌ నష్టపోగా, అమెరికా లాభపడుతుందని చెప్పారు. ఇరాన్‌, రష్యా నుంచి ఆయిల్‌, గ్యాస్‌ దిగుమతి చేసుకోవడం వల్ల కొంతకాలంగా ధరలు స్థిరంగా ఉన్నాయని, ఈ దేశాలకు డాలర్లలో చెల్లించాల్సిన అవసరం లేదని, రూపాయిల్లోనే చెల్లిస్తున్నామని చెప్పారు. భారత్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చి ఆయిల్‌, గ్యాస్‌ కొనుగోలు చేయించేలా చూస్తోందన్నారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో భారతీయులకు నివసిస్తున్నారంటూ బేడీలు వేసి, నీళ్లు, అన్నం లేకుండా అమెరికా నుంచి భారత్‌కు తరలించారని, భారతీయులకు జరిగిన అవమానం గురించి కనీసం మోడీ నిరసన కూడా తెలపలేదన్నారు. ఈ సదస్సుకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమొక్రసి జిల్లా నాయకులు రాంబాబు, పార్వడీ బ్లాక్‌ నాయకులు నరసింహులు, సిపిఐ నాయకులు మాలకొండయ్య పాల్గొన్నారు.
➡️