పదేళ్ల తర్వాత మళ్లీ నెత్తురోడిన చల్పాక అటవీ ప్రాంతం
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చల్పాక అటవీ ప్రాంతంలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో కీలక నేతలు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డిసెంబర్ రెండు నుంచి ఎనిమిది వరకు వారోత్సవాలను జరుపుకోవాలని మావోయిస్టులు కరపత్రాలను ఇటీవల విడిచి వెళ్లారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు వారోత్సవాలను భగం చేసేందుకు గుత్తికోయ గూడేలు, అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో అడవుల్లో మోహరించిన గ్రేహౌండ్స్ దళాలకు పులకమ్మ వాగు సమీపంలోని అడవిలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఇల్లందు-నర్సంపేట ఏరియా దళ కమాండర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా చేరమంగి గ్రామానికి చెందిన కురుసం మంగు అలియాస్ బద్రు అలియాస్ పాపన్న (35), ఏటూరునాగారం-మహాదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన గోలపు మల్లయ్య అలియాస్ మధు (43), ఎసిఎంగా పనిచేస్తున్న బీజాపూర్ జిల్లా ఉసురు గ్రామానికి చెందిన ముసాకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), బైరాంఘర్ గ్రామానికి చెందిన ఎసిఎం ముసాకి జమున (23), మావోయిస్టు పార్టీ సభ్యులు, ఇంద్రావతికి చెందిన జై సింగ్ (25), బీజాపూర్ జిల్లా గంగులూరు గ్రామానికి చెందిన కిషోర్ (22), ఉసూర్ గ్రామానికి చెందిన కామేష్ (23) ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా, పది సంవత్సరాల క్రితం ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం అడవుల్లో ఎన్‌కౌంటర్లు జరిగేవి. తాజా ఎన్‌కౌంటర్‌తో గిరిజన పల్లెల్లో మళ్లీ అలజడి మొదలైంది.
లొంగిపోవాలని హెచ్చరించాం : ములుగు జిల్లా ఎస్‌పి
మావోయిస్టులు మారుమూల పల్లెలో తలుదాచుకున్నారనే సమాచారం మేరకు గ్రేహౌండ్స్ దళాలు పల్లెలు, అడవుల్లో సోదాలు చేపట్టినట్టు ములుగు జిల్లా ఎస్‌పి శబరీష్ తెలిపారు. ఈ క్రమంలో చల్పాక ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 15 మంది అనుమానాస్పదంగా కనిపించారని చెప్పారు. వారిని లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా వినలేదని తెలిపారు. ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారని, మిగిలిన వారు తప్పించుకున్నారని చెప్పారు. వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఘటనా స్థలాన్ని ములుగు డిఎస్‌పి రవీందర్, బయ్యారం డిఎస్‌పి రవీందర్ రెడ్డితో కలిసి ఎస్‌పి పరిశీలించారు.