విద్యార్థి సంఘం ఎన్నికల్లో మట్టికరిపించిన మతోన్మాద శక్తులు
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియు) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వామపక్ష, సామాజిక శక్తుల కూటమి మరోసారి ఘన విజయం సాధించింది. ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థులు కీలక పోస్టులను కైవసం చేసుకున్నారు. ఈ నెల 25న ఎన్నికలు జరగ్గా 26న రాత్రి ఫలితాలు వెల్లడయ్యాయి. అధ్యక్షునిగా ఎ.ఉమేష్ అంబేద్కర్ తన ప్రత్యర్ధి ఎబివిపి అభ్యర్ధి ఆకాశ్ బాటిపై 26 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి పోస్టుకు పోటీ చేసిన నిహాద్ సులేమని (ఎస్‌ఎఫ్‌ఐ) తన ప్రత్యర్థి యశస్వి (ఎబివిపి)పై 207 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపాధ్యక్ష పోస్టుకు పోటీ చేసిన ఆకాశ్ కుమార్ తన ప్రత్యర్థి పవన (ఎబివిపి)పై 213 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి త్రివేణి తన ప్రత్యర్థి ముషాద్ అహ్మద్‌పై 451 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సాంస్కృతిక కార్యదర్శి స్థానానికి ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కెవి.కృష్ణమూర్తి తన ప్రత్యర్థి సోనియా దాస్‌పై 179 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
జిఎస్ క్యాస్ (ఇంటిగ్రేడెడ్) కేటగిరిలో కృషి ప్రేరణ, జిఎస్ క్యాస్ (పిజి) కేటగిరిలో శృతికీర్తి, జిఎస్ క్యాష్ (పరిశోధన) కేటగిరిలో భవితశ్రీ విజయం సాధించారు. వీరంతా ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థులే. హెచ్‌సియు విద్యార్థి సంఘం ఎన్నికల్లో మతోన్మాద ఎబివిపిని ఓడించి ఎస్‌ఎఫ్‌ఐ నేతృత్వంలోని వామపక్ష, సామాజిక శక్తులకు ఘనవిజయం కట్టబెట్టిన విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జేజేలు తెలిపింది. విజేతలను అభినందించింది.