ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలనే కొనసాగిస్తుందని, ఐదు రకాల పాఠశాల వ్యవస్థతో ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరిగే ప్రమాదం ఉందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ.అశోక్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వ విధానంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం జిఒ 117తో ప్రాథమిక పాఠశాలలను రెండు ముక్కలు చేసిందన్నారు. దీంతో 12,247 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయని తెలిపారు. ఈ జిఒను రద్దు చేయడం శుభ పరిణామమేనని, అయితే, దీని స్థానంలో తీసుకువచ్చిన నూతన ఉత్తర్వులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన మెమోలో విద్యార్ధులు ప్రకాశవంతమైన భవిష్యత్‌తో గ్లోబల్ పౌరులు కావాలని లక్ష్య నిర్ధేశం చేశారని, నేటికి ప్రాథమిక విద్య పూర్తి చేసిన విద్యార్ధులకు చదవడం, రాయడం రావడం లేదని, ఈ పరిస్థితుల్లో అంత గొప్ప లక్ష్యాన్ని నిర్ధేశించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఈ వ్యవస్థలో ప్రాథమిక పాఠశాలలు, బేసిక్ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలుగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారని, ఆదర్శ పాఠశాలలు ఆదర్శవంతంగా తయారవుతాయో లేదో కాని, బేసిక్ పాఠశాలలు మాత్రం కునారిల్లిపోతున్నాయని స్పష్టం చేశారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్‌తో భవిష్యత్తులో 20 వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్నాయని తెలిపారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో 30 మంది కంటే తక్కువ ఉన్న విద్యార్థులను సమీప హైస్కూళ్లలో చేర్చి, వీటిని రద్దు చేస్తారన్నారు. ఫలితంగా విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడనుందని తెలిపారు.
ఈ మెమోలో మాతృ భాష మాధ్యమం ప్రస్తావన లేదన్నారు. రెండు మాధ్యమాలు సమాంతరంగా ఉండాలనే ఆలోచనను మరిచారని పేర్కొన్నారు. విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి సెక్షన్‌ల ఆధారంగా కాకుండా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉండాలని కోరారు. ప్రపంచ బ్యాంక్ షరతుల్లో భాగంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన సాల్ట్ విధానాలను కొనసాగిస్తారా? లేదా? అనే అంశంపై స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
