ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశ విద్యా రంగానికి తాజా బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పేర్కొంది. విద్యను కార్పొరేట్, ప్రైవేట్ రంగానికి ధారాదత్తం చేయడానికి ఈ బడ్జెట్‌లో చర్యలు తీసుకుందని తెలిపింది. గతేడాది కంటే ఈ ఏడాది కేవలం 0.2 శాతం మాత్రమే విద్యారంగానికి కేటాయింపులు పెంచారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె ప్రసన్న కుమార్, ఎ అశోక్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిధులు ఏమాత్రం విద్యాభివృద్ధికి సరిపోవన్నారు. 2024 జూన్‌లో వచ్చిన పోషన్ ట్రాకర్ డేటా ప్రకారం దేశంలో 17 శాతం (2.7 కోట్ల మంది పిల్లలు) తక్కువ బరువుతో ఉన్నారని వెల్లడించిందని, ఈ లెక్కన ప్రస్తుతం కేటాయింపులతో ఒక పిల్లాడికి 5 పైసలు మాత్రమే నిధులు పెరిగాయన్నారు. ఇప్పటికే పాఠశాల విద్యకు దేశంలో నిధుల కొరత తీవ్రంగా వేధిస్తుందని, ఈ నేపథ్యంలో పాఠశాల విద్యకు గతేడాది కేటాయించిన రూ.73,008 కోట్ల నుంచి రూ.78,572 కోట్లకు పెంచారని, సవరించిన అంచాల్లో ఈ మొత్తం తగ్గించకుండా చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు రంగంలో పరిశోధకులు కోసం ఈ బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగాయన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగ అభివృద్ధి కోసం 2024 బడ్జెట్‌లో ప్రకటించిన ప్రైవేట్ రంగ ఆధారిత పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల చొరవ కోసం ప్రభుత్వం రూ.20 వేలకోట్లు కేటాయించిందని, అదే సమయంలో ప్రభుత్వ పథకాలకు రూ.355 కోట్లకు తగ్గించారని తెలిపారు. ప్రైవేటు సంస్థలకు రూ.327 కోట్లు మూలధనం ఇస్తూ వారి మార్కెట్ అవసరాలకు కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. ఉన్నత విద్య కోసం బడ్జెట్‌ను రూ.47,619.77 కోట్ల నుంచి రూ.50,077.95 కోట్లకు కేవలం 5 శాతం పెరుగుదలను ఉందని, కానీ ఈ ఏడాది బడ్జెట్‌లో ఉన్నత విద్య వాటా 1 శాతం కంటే తక్కువగా ఉందన్నారు. ‘ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్’ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి అనుగుణంగా వేద విద్యను ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకోవడాన్ని ఖండించారు. రాష్ట్రాల హక్కులను లాక్కుని విద్య కేంద్రీకరణ, కార్పొరేటీకరణ కోసం కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
