ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : ఈ నెల 15వ తేదీ నుండి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి విజయవాడలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్ తెలిపారు. విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో నిరసన దీక్షల పోస్టర్‌ను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అశోక్ మాట్లాడుతూ గతంలో తమ సంఘం చలో విజయవాడ పిలుపునిచ్చిన సందర్బంలో ప్రభుత్వం చర్చలకు పిలిచి రూ. ఐదు వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని, జివో 77 రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఈ హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గోపి నాయక్, కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు పోస్టర్‌ను ఆవిష్కరించారు.
