ఏకలవ్య విద్య సంస్థల్లో స్థానికులను అధ్యాపకులుగా నియమించండి : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రజాశక్తి-అమరావతి : ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సీ విద్య సంస్థల్లో స్థానికులను అధ్యాపకులుగా నియమించాలి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్‌ ఏ.అశోక్‌ సిఎం చంద్రబాబును ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో ఏకలవ్య విద్యా సంస్థలు 28 ఉన్నాయని, ఎక్కువ భాగం ఏజెన్సీ ప్రాంత షెడ్యూల్డ్‌ ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిలో సుమారు 15వేల మంది ఆదివాసీ విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. ఇ.ఎంఅర్‌.ఐ ఏర్పాటు చేసినప్పటి నుండి స్థానిక ఉపాధ్యాయులు బోధన సిబ్బందిగా వుండేవారని అన్నారు. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వ నియమించిన టీచర్స్‌, లెక్చర్స్‌ బీహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, హర్యానా నుండీ వచ్చినవారని.. వారు హిందీ భాషలోనే అన్ని పాఠాలు చెప్పడంతో గిరిజన విద్యార్థులకు ఏమి అర్ధం కాక తెల్లమొహం వేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికే ఏలూరు, పాడేరు నెల్లూరు, గుమ్మలక్షిపురంలో ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు పాఠాలు అర్ధం కాక పాఠశాల విడిచి వెళ్ళిపోతున్నారని ఆందోళన వక్తం చేశారు. ఇదే పద్ధతి కొనసాగితే డ్రాప్‌ఔట్స్‌ పెరిగుతాయన్నారు. ఇఏం.అర్‌.ఐ సొసైటీ నిబంధనలు భాష ప్రయుక్త రాష్ట్రాలలో అమలు చేయడం వల్ల విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో అమలు వల్ల ఎక్కవ మంది గిరిజన విద్యార్థులు డ్రాప్‌ అవుట్‌ అవుతున్నారని పేర్కొన్నారు. నూతన విద్య విధానంలో మాతృ భాష విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంటూ మరో పక్క ఆదివాసీ గిరిజన విద్యార్థులను విద్య నుండి దూరం చేయడం దారుణమన్నారు. ఏజెన్సీ ప్రాంత పాఠశాలలో నియమించే టీచర్‌ జిఒ నెం:3 రిజర్వేషన్‌ను సుప్రీం రద్దు చేసిన అనంతరం స్థానికేతరులు టీచర్స్‌గా నియమించడం వల్ల ఆదివాసీ చిన్నార్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. విద్యార్థుల సమస్యను దృష్టిలో ఉంచుకుని స్థానిక అధ్యాపకులు నియమించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు.

➡️