పిటిఎంలో విద్యార్థుల సమస్యలు చర్చించాలి : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం నిర్వహించనున్న మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ (పిటిఎం) విద్యార్థుల సమస్యలు చర్చించే వేదికగా ఉండాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ కోరింది. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావాన్ని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె ప్రసన్నకుమార్‌, ఎ అశోక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం వల్ల అధికారులు, ప్రభుత్వ పెద్దల ఉపన్యాసాలకే పరిమితం కాకుండా.. స్థానికంగా ఉన్న సమస్యలపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు చర్చించే వేదికలుగా ఉండాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ 117ను పూర్తిస్థాయిలో రద్దు చేసి ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న నాడు-నేడు పనులు పూర్తి చేయాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తమ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై తల్లిదండ్రులు చర్చించాలని విజ్ఞప్తి చేశారు.

➡️