ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగించాలి : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫీజు గడువును పొడిగించాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ కోరింది. రాష్ట్రంలో 11 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాయనున్నారని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు కె ప్రసన్నకుమార్‌, ఎ అశోక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 21తో ముగిసిందని, కానీ సర్వర్‌ ఇబ్బందులు తదితర సాంకేతిక కారణాల వల్ల అనేక మంది విద్యార్థులు ఫీజు చెల్లించలేకపోయారని తెలిపారు. గడువు ముగిసిన కారణంగా రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తున్నారని, ఇది ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. ఫీజు గడువును ఈ నెల 30 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసరాల ధరలతో ఇప్పటికే ఎనలేని భారాలు మోస్తున్న పేదలు ఇలాంటి చర్యల వల్ల విద్యకు దూరమయ్యే ప్రమాదముందని, వీటిన్నటిని దృష్టిలో పెట్టుకొని ఫీజు చెల్లింపు గడువును పొడిగించాలని కోరారు. ఆ తర్వాత కూడా ఏవైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే ఆ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

➡️