అంబేద్కర్‌ విగ్రహానికి అవమానం

Jun 10,2024 08:20 #BR Ambedkar, #Dalit youth, #Dharna
  • రోడ్డుపై బైఠాయించిన దళితులు

ప్రజాశక్తి-రామచంద్రపురం : అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఆ మహానీయునికి ఘోర అవమానం జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకో వాలంటూ దళిత యువకులు ఆందోళన చేశారు. కె గంగవరం మండలంలోని ఎర్రపోతవరంలో అంబేద్కర్‌ విగ్రహానికి శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చెప్పుల దండలు వేశారు. దళితులను, స్థానిక వైసిపి సర్పంచ్‌ పిల్లి రాంబాబును ఉద్దేశించి అసభ్య రాతలతో పోస్టర్లను అతికించారు. ఆదివారం ఉదయం దళిత యువకులు దీనిని గమనించి ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. డిఎస్‌పి రామకష్ణ సిబ్బందితో అక్కడకు చేరుకొని వారికి నచ్చజెప్పారు. ప్రస్తుతం సెక్షన్‌ 30 అమలులో ఉందని ఆందోళనను సత్వరమే విరమించాలన్నారు. దీనిపై విచారించి దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దీంతో దళితులు ఆందోళన విరమించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి ఉన్న చెప్పుల దండలు, పోస్టర్లను తొలగించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పెట్టా శ్రీనివాసరావు, రవ్వా భూషణం, సర్పంచ్‌ అంబటి తుకారం, మాజీ సర్పంచ్‌లు దున్న అన్నవరం, ఈరేల్ల రాజు, నాయుడు, విప్పర్తి బాబురావు, చెల్లె సూర్యారావు, పోతు వెంకట్రావు, సుధాకర్‌ పాల్గొన్నారు.

రాతలపై వైసిపి సర్పంచ్‌ ఆగ్రహం
తనను ఉద్దేశించి అసభ్య పదజాలంతో లెటర్‌ రాసి వేలాడ దీయడంపై వైసిపికి చెందిన సర్పంచ్‌ పిల్లి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు రాజకీయ కక్షతోనే ఈ పని చేశారని అన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కావాలనే బురద జల్లుతున్నారు: టిడిపి నాయకులు
అంబేద్కర్‌ విగ్రహానికి చెప్పులు దండ వేసి అవమానిస్తూ ఉత్తరాలు రాయడం వెనక వైసిపి నాయకులే ఉన్నారని, టిడిపిని అభాసుపాలు చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని టిడిపి నాయకుడు రవ్వా భూషణం ఆరోపించారు.

కెవిపిఎస్‌ ఖండన
డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి చెప్పుల దండలు వేయడాన్ని కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ఒక ప్రకటనలో ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️