విశాఖ స్టీలుపై కేంద్రాన్ని ప్రశ్నించండి.. షర్మిల డిమాండ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విశాఖ స్టీలు ప్లాంటు పరిరక్షణ కోసం గతంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, మోడీ, షాను నిలదీయాలని పిసిసి అధ్యక్షులు షర్మిల డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆదివారం ఆమె పోస్టు చేశారు. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో విశాఖ స్టీలుప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖను కూడా ఆయనకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఆ లేఖ ప్రతిని ఎక్స్‌లో చేసిన పోస్టులో జత చేశారు. ప్రైవేటీకరణ అడ్డుకుంటామని, ప్లాంటు పూర్వ వైభవానికి కృషి చేస్తామని, అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని ఆ లేఖలో రాశారో లేదో ఒకసారి చదవాలని కోరారు. మాటమీద నిలబడే తత్వం ఉంటే, ఇచ్చిన లేఖకు విలువ ఉంటే వెంటనే కేంద్రాన్ని నిలదీయాలని కోరారు. ప్లాంటు ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకోవాలని, ఆంధ్రుల హక్కు ముఖ్యమా ? బిజెపితో పొత్తు ముఖ్యమా, విశాఖ ఉక్కు ముఖ్యమా- ఎన్‌డిఎలో పదవులు ముఖ్యమా తేల్చకోవాలని అన్నారు. కార్మికులకు విజయదశమి కానుకగా ప్లాంటును సెయిల్‌లో విలీనం చేస్తున్నట్లు, 14 వేలమంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తున్నట్లు ప్రకటన ఇవ్వాలని కోరారు. భూములు కోల్పోయిన ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయించాలని, లేనిపక్షంలో ఎన్‌డిఏ కూటమి నుండి వైదొలగాలని కోరారు.

➡️