ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అదానీ గ్రూపు సంస్థల ముడుపుల అంశంపై వెంటనే విచారణ చేపట్టాలని ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ ఈ విషయంలో సిఎం చంద్రబాబు అదానీ పేరు ఉచ్చరించేందుకు కూడా సాహసించడం లేదని విమర్శించారు. అదానీ, మాజీ సిఎం జగన్ మధ్య వెలుగులోకి వచ్చిన ముడుపుల వ్యవహారంపై విచారణ నిర్వహించాల్సిందిగా గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ను కోరారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో బుధవారం గవర్నర్‌ను కలిసి ఆమె ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ కుంభకోణంపై జెపిసి నియమించాలని కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు కోరుతుంటే, చంద్రబాబు మౌనం వహిస్తున్నారని చెప్పారు. బిజెపితో ఉన్న సంబంధాల వల్లే ఈ వ్యవహారంపై సిఎం విచారణకు ఆదేశించడం లేదన్నారు. అదానీ సంస్థతో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాటాను విక్రయించడంలో జరిగిన అవకతవకలపై కూడా విచారణ చేపట్టాలని కోరారు. రూ.9 వేల కోట్ల విలువ చేసే వాటాను కేవలం రూ.640 కోట్లకే అదానీకి వియ్రించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది ప్రజలకు వివరించాలని కోరారు. మాజీ సిఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్కులా అదానీకి రాసిచ్చేశారన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో నాయకులు ఆమంచి కృష్ణమోహన్, మస్తాన్‌వలీ తదితరులు ఉన్నారు.