ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లే అంశంపై వైసిసి పార్టీ తమ వైఖరేంటో వెల్లడించాలని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లకపోతే పార్టీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఇంట్లో కూర్చొని ప్రెస్‌మీట్‌లు పెట్టడానికి కాదు ప్రజలు ఓటేసిందనే విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఓ ప్రకటనలో కోరారు. ఆ పార్టీ నాయకులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. ప్రజల సంపదను ప్యాలెస్‌కు మళ్లించుకున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు సిద్ధం అంటూ బయటకు వచ్చారని, ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమతం చేశారని, చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు.
