- ఆస్తుల్లో జగన్, షర్మిలకు సమాన వాటా : విజయమ్మ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఒక బిడ్డ.. ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టమని, తల్లిగా అన్యాయం జరిగిన షర్మిల పక్షాన నిలిచి మాట్లాడ టం తన విధి అని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. ఎంఒయు ప్రకారం జగన్‌కు 60 శాతం, షర్మిలకు 40 శాతం అయితే ఎంఒయుకు ముందు డివిడెంట్ సమానంగా ఎందుకు తీసుకున్నారని మంగళవారం విడుదల చేసిన లేఖలో ప్రశ్నించారు. ఆస్తుల విషయంలో జరిగిన ఒప్పందాలన్నింటికీ తానే ప్రత్యేక్ష సాక్షినన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండగా ఆస్తులు పంపకం జరగలేదని, ఉన్న ఆస్తులను ఒక్కొక్కరూ ఒక్కొక్కటి పర్యవేక్షించే వారని వెల్లడించారు. ఈ విషయంలో విజయసాయి, సుబ్బా రెడ్డి, మరికొందరు ఎన్నో అసత్యాలు చెప్పారని తెలిపారు. వైఎస్‌ఆర్ బతికుండగానే ఆస్తులు పంచా రని, షర్మిలకు ఇచ్చిన ఆస్తులు అంటూ కొన్నింటి జాబితాను చెప్పుకొచ్చారని, జగన్ ఆస్తులు లిస్టు కూడా చెప్పాల్సిందన్నారు. వైఎస్‌ఆర్ చేసింది ఆస్తుల పంపకం ముమ్మాటికీ కాదన్నారు. కొన్ని ఆస్తులను ఇద్దరి పేర్ల మీద పెట్టారన్నారు. విజయసాయికి ఆడిటర్‌గా అన్నీ తెలుసని, సుబ్బారెడ్డి ఎంఒయుపై సాక్షి సంతకం చేశారని, అయినా మీడియాతో అవాస్తవాలు చెప్పడం బాధ కలిగించిందన్నారు. ఈ అంశానికి ముగింపు పలకడానికి నిజం వెల్లడిస్తు న్నానని, ఆస్తులు నా ఇద్దరి బిడ్డలకు సమానమని, నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా ఉండాలన్నది వైఎస్‌ఆర్ చెప్పారన్నారు. 2019లో జగన్ సిఎం అయిన రెండు నెలలకు ఇజ్రాయిల్‌లో విడిపోవాలని ప్రతిపాదన తీసుకొచ్చారని, ఆ ప్రకారం విజయవాడలో తన సమక్షంలో ఆస్తులు ఎవరెవరికి ఏవనేదానిపై అంగీ కారానికి వచ్చారని, అప్పుడు ఎంఒయు తయారు చేసినట్లు చెప్పారు. హక్కు ఉంది కాబట్టే షర్మిలకు రూ.200 కోట్లు డివిడెంట్లు ఇచ్చారని, హక్కు ఉంది కాబట్టే ఎంఒయు రాశారని తెలిపారు. ఇవి జగన్ గిఫ్ట్‌గా ఇస్తున్నవి కాదని స్పష్టం చేశారు. అటాచ్‌మెంట్‌లో లేని ఆస్తుల విషయంలో షర్మిలకు అన్యాయం జరిగిందని, భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్‌ఆర్ ఇల్లు వంటివి కేసుల అనంతరం ఇవ్వాల్సి ఉందన్నారు. వైఎస్‌ఆర్ కుటుంబం గురించి, బిడ్డల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దని కోరారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయొద్దని, ధూషణలు చేయొద్దని కోరారు. అన్నా, చెల్లెలు ఇద్దరూ తెలుసుకుంటారని, వారిని రెచ్చగొట్టొద్దని విజ్ఞప్తి చేశారు. కుటుంబ ఆస్తుల విషయంలో అబద్ధాల పరంపర కొనసాగకూడదని, ఇది పిల్లలిద్దరికే కాదు, రాష్ట్రానికి మంచిది కాదన్నారు.