- ప్రజాసంఘాల ఆధ్వర్యాన చలో కలెక్టరేట్
- అడ్డుకున్న పోలీసులు.. రహదారిపై బైఠాయింపు
ప్రజాశక్తి పార్వతీపురంరూరల్ : పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం శివ్వాం దళితుల భూమిని వారికి అప్పగించాలని రైతు, వ్యవసాయ కార్మిక, కెవిపిఎస్, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గత 40 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో సోమవారం చలో కలెక్టరేట్‌కు పూనుకున్నారు. ఈ ధర్నాకు ఆయా సంఘాల నాయకులు అనుమతులు కోరినప్పటికీ, పోలీసులు నిరాకరించారు. గతంలో అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో నాయకులను నిర్బంధించేందుకు సోమవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నాయకులను ఇళ్ల వద్దనే నిర్బంధించారు. ధర్నాకు వచ్చిన వారిని స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌లో అరెస్టు చేశారు. నిర్బంధాలను ఎదుర్కొని నాయకులు, శివ్వాం దళితులు బెలగాం రైల్వే స్టేషన్ నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీ ప్రారంభించారు. దీనిని స్థానిక చర్చి జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఐదుగురికి మాత్రమే అధికారులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడంతో నాయకులు తిరస్కరించారు. అధికారులు బయటకు రావాలని పట్టుపట్టారు. పోలీసులు నిరాకరించడంతో ప్రజాసంఘాల నాయకులు, దళితులు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో పోలీసులు డిఆర్‌ఒ కేశవనాయుడు, ఆర్‌డిఒ హేమలతను అక్కడికి రప్పించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ.. సమస్య పరిష్కరించేందుకు తగు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శివ్వాం భూముల్లో పంట ఎవరు వేయాలనేది రెండు రోజుల్లో రాతపూర్వకంగా తెలియజేస్తానని హామీ ఇచ్చారు. మరిన్ని గ్రామాల భూ సమస్యలను ఆయా మండలాల తహశీల్దార్లకు వివరించాలని, వారు ఆ సమస్యలను పరిష్కరించేలా కలెక్టరేట్ నుండి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో, తాత్కాలికంగా కార్యక్రమాన్ని ముగిస్తున్నామని, సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యేంత వరకు దీక్షల శిబిరం మాత్రం కొనసాగిస్తామని నాయకులు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. పేదల భూముల సర్వే చేపట్టి న్యాయబద్ధంగా వారికి రావాల్సిన భూములను వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి వేణు, పలువురు ప్రజాసంఘాల నాయకులు, భూ బాధిత గ్రామస్తులు పాల్గొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కె.మన్మధరావు, ఎఐజిఎస్‌ఎస్ సంఘ నాయుకులు సంగం, సిపిఐఎంఎల్ నాయుకులు బొత్స నర్సింగరావు సంఘీభావం తెలిపారు.