పరిహారంలో ఊరట కరువు

రైతులకు అందని ప్రభుత్వ సాయం

ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : వరద ముంపునకు గురై పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు కనీస ఊరట లభించడంలేదు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో భారీగా నష్టపోయిన రైతులకు వివిధ కారణాలను సాకుగా చూపి నష్ట గణన చేయలేదు. దీంతో నష్టపోయిన రైతుల్లో కొందరికే పాక్షికంగా పరిహారం అందింది. మరికొందరి పేర్లు అసలు నష్ట గణన జాబితాలోనే నమోదు కాలేదు. దీంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా వారి గోడు పట్టించుకునేవారే కరువయ్యారు.
కృష్ణా జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతంలోని అత్యధిక విస్తీర్ణంలో పసుపు, కంద, అరటి, కూరగాయలు, పూల తోటలతోపాటు ఉద్యాన పంటలను రైతులు సాగు చేశారు. ఇందుకుగాను ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టారు. పసుపునకు ఎకరాకు రూ.90 వేలు, కందకు రూ.2.50 లక్షలు, అరటి, చెరకు, కూరగాయల తోటలకు రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. గత నెలలో వచ్చిన భారీ వరదలకు నదీ కరకట్ట లోపల ఉన్న వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయి. పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.

 


పరిహారం చెల్లింపులోనూ సమస్యలు
జిల్లాలోని 9,616 సర్వే నంబర్లలోగల 3,139.272 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. దీంతో బాధిత రైతులకు రూ.10.80 కోట్ల మేర పరిహారం అందించాల్సి ఉంది. అయితే, ఐదెకరాలలోపు విస్తీర్ణానికి మాత్రమే ప్రభుత్వం పరిహారాన్ని పరిమితం చేసింది. ముంపునకు గురైన పొలాలను ఆధార్‌ కార్డుల ఆధారంగా అధికారులు కుదించారు. ఈ నేపథ్యంలో 6,5511 మంది రైతులకు రూ.10.42 కోట్ల మేర పరిహారం జమ కావాల్సి ఉంది. కొందరి రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింకు లేకపోవడంతో నగదు జమకాలేదని అధికారులు చెబుతున్నారు. మరోపక్క వివిధ కారణాలతో తమ భూములకు ఎన్యుమరేషన్‌ చేయకపోవడంతో పరిహారానికి దూరమయ్యాయని రైతులు వాపోతున్నారు.

పరిహారం రాలేదు
– నలుకుర్తి సుధాకరరావు, రైతు, సూరపనేనిపాలెం, ఘంటసాల మండలం
ఎకరంలో అరటి తోట, అరెకరం చెరకు తోట సాగు చేశా. 1.50 ఎకరాలకు రూ.65 వేలు పెట్టుబడి పెట్టా. కృష్ణానదికి వచ్చిన వరదకు పంట మునిగిపోయింది. అధికారులు ఎన్యుమరేషన్‌ చేయలేదు. నాకు పరిహారం రాలేదు.

లీజు పట్టా ఉన్నా అందలేదు
– బుర్రె రాజేష్‌, రైతు, పాపవినాశనం, ఘంటసాల మండలం
పాపవినాశనం లంకలో ఎకరంలో మిరప, ఎకరంలో వంగ పంటలు సాగు చేశాను. ఎకరాకు రూ.50 వేల చొప్పున లక్ష రూపా యలు పెట్టుబడి పెట్టాను. అప్పులు చేసి పంట సాగు చేశాను. వరదకు పంట మునిగిపోయింది. భూమి సాగుకు లీజు పట్టా ఉంది. కానీ అధి కారులు ఎన్యుమరేషన్‌ చేయలేదు. ప్రభుత్వ పరిహారం రాలేదు.

ప్రయివేటు గ్రామ కంఠం భూమికి ఎన్యుమరేషన్‌ చేయలేదు
– గొరిపర్తి సురేష్‌బాబు, రైతు, నడకుదురు, చల్లపల్లి
4.40 ఎకరాల్లో పసుపు పంట సాగు చేశా. ఎకరాకు రూ.90 వేలు పెట్టుబడి పెట్టాను. ఎకరాకు రూ.14 వేల చొప్పున 2.40 ఎకరాలకు పరిహారం ఇచ్చారు. మరో 2 ఎకరాలకు పరిహారం జమకాలేదు. ఎన్యుమరేషన్‌ ఎందుకు చేయలేదని అడిగితే గ్రామ కంఠం భూమి అని చెబుతున్నారు. రెండెకరాలు ప్రయివేటు గ్రామ కంఠం భూమి అని అధికారులకు వివరించినా ఎన్యుమరేషన్‌ చేయడం లేదు.

➡️