పాడేరు ఐటిడిఎ పాలకవర్గ సమావేశంలో మంత్రిని నిలదీసిన ప్రజాప్రతినిధులు
ప్రజాశక్తి-పాడేరు టౌన్ (అల్లూరి జిల్లా) : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటిడిఎ 74వ పాలకవర్గ సమావేశం సోమవారం వాడివేడిగా సాగింది. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా, గిరిజన ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులైన ఎంపిపి, జడ్‌పిటిసి సభ్యులు సైతం వైసిపికి చెందినవారు కావడంతో సమావేశంలో అనేక సమస్యలపై తీవ్ర చర్చలు జరిగాయి. ముఖ్యంగా జిఒ-3కి ప్రత్యామ్నాయ జిఒ చట్టబద్ధతకు పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేయాలని, గిరిజన స్పెషల్ డిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేయాలని, ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఎంపిపి, జడ్‌పిటిసి సభ్యులు పట్టుబట్టారు. ఈ విషయమై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని నిలదీశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య కొంతసేపు తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా సభ్యులందరూ నిలబడి మంత్రితో మూకుమ్మడిగా ప్రశ్నించారు.
దీనిపై మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలోనే సుప్రీంకోర్టు జిఒ-3ని కొట్టివేస్తే ఎందుకు పట్టించుకోలేదని, జిఒ-3కి ప్రత్యామ్నాయంగా అప్పుడు మీరు ఏం చేశారని తిరిగి ప్రశ్నించారు. ఒక్క డిఎస్‌సి కూడా నిర్వహించలేకపోయారని తెలిపారు. వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అంశాలను ప్రస్తుత సమావేశంలో నిలదీయడంపై మంత్రి మండిపడ్డారు. జిఒ-3కి ప్రత్యామ్నాయంగా వేరే జిఒ తీసుకొచ్చి గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అనంతగిరి సిపిఎం జడ్‌పిటిసి దీసరి గంగరాజు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక ఆదివాసీలకే వంద శాతం ఉద్యోగాలు కల్పించే జిఒ-3 ప్రయోజనాలను కాపాడుతూ ప్రత్యామ్నాయ జిఒ తీసుకొచ్చి ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. జిఒ-3 ప్రయోజనాల చట్టబద్ధతకు పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
