- బకాయి వేతనాలు చెల్లించాలని కలెక్టరేట్ వద్ద ఉపాధి కార్మికుల ధర్నా
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్ : పనుల వద్ద చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం, మెడికల్ కిట్లు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, 12 వారాల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ కార్మికులు ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ధర్నాలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శివనాగరాణి, జిల్లా అధ్యక్షులు ఎం.నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఎం.నరసింహ నాయక్ మాట్లాడారు. ఉపాధి హామీ చట్టానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయన్నారు. కేంద్రం బడ్జెట్‌లో నిధులు తగ్గించేస్తోందని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా కార్మికులకు 12 వారాల వేతన బకాయిలు ఉన్నాయని, వెంటనే వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. క్రమం తప్పకుండా వారం వారం బిల్లులు చెల్లించాలని, పని ప్రదేశాలలో మెడికల్ కిట్లు, నీడ వసతి, మంచినీళ్లు ఏర్పాటు చేయాలని చట్టంలో పేర్కొన్న అధికారులు మాత్రం అమలు చేయడం లేదన్నారు. కార్మికులు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్న మేటీలను తొలగించి అధికార పార్టీ నాయకులు చెప్పిన వారినే అధికారులు ఎంపిక చేస్తున్నారని విమర్శించారు. కొన్ని గ్రామాలలో కార్మికులు పనులు అడుగుతున్నా కల్పించడం లేదన్నారు. రోజువారీ వేతనం రూ.600 ఇవ్వాలని, 200 రోజులు పని కల్పించాలని, రాజకీయ జోక్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇన్‌ఛార్జి జెసి రామ్‌నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.నాగరాజు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్, జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు, నాయకులు పాల్గొన్నారు.