మన్యం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

  • ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ : పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా జిల్లాలో విద్యాభివృద్ధికి తోడ్పడే విద్యాసంస్థలు లేకపోవడం బాధాకరమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ అశోక్‌ అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో మంగళవారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలు బాగా వెనకబడిన ప్రాంతాలని, ఇలాంటి ప్రాంతాల్లో వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించేలా విద్యాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మోహన్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, పార్వతీపురంలో మెడికల్‌ కాలేజీ, గిరిజన పోస్ట్‌ మెట్రిక్‌ కాలేజీ, బార్సు హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలని, ఉపాధ్యాయులపై యాప్‌ విధాన నిబంధనలను రద్దు చేయాలని, 117 జిఒను రద్దు చేసి పాఠశాలల విలీనం ఆపాలని డిమాండ్‌ చేశారు. మన్యం జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి కె.రాజు మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్‌, ఎఎన్‌ఎం పోస్టులను భర్తీ చేయాలని, ఖాళీగా ఉన్న సంక్షేమ హాస్టళ్లలో వార్డెన్లను, వర్కర్లను వెంటనే నియమించాలని కోరారు. గరుగుబిల్లి, సీతంపేట మండలాల్లో జూనియర్‌ కళాశాల, కురుపాం, బలిజిపేట కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు, వీరఘట్టంలోని డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌సి, బిసి పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లకు సొంత భవనాలు, గిరిజన పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లకు అదనపు భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. మెస్‌ ఛార్జీలు రూ. మూడు వేలకు పెంచాలని, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు టి అఖిల్‌, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్‌ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

➡️