- చేసిన పనికి వేతనాలివ్వండి!!
- నినదించిన వ్యవసాయ కార్మికులు
- అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్
- విజయవాడలో మహాధర్నా
- కేటాయింపులు పెంచకపోతే నేతల ఇళ్లు ముట్టడిస్తాం : బి. వెంకట్
- పోరాటాలకు అండగా ఉంటాం : వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : ‘ఉపాధి పనైనా చూపండి …తిండైనా పెట్టండి’ ‘ఆకలితో చంపొద్దు ..చేసిన పనికి వేతనాలివ్వండి’ అంటూ వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున చేసిన నినాదాలతో విజయవాడలోని ధర్నా చౌక్ బుధవారం మారుమ్రోగింది. ఉపాధి హామీ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేసి వలసలు నివారించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం(వ్య.కా.స) చేపట్టిన మహాధర్నాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వ్యవసాయ కార్మికులు భాగస్వాముల య్యారు. ఉపాధి పనుల కోసం, బకాయిల చెల్లింపుల కోసం వీరు చేసిన నినాదాలతో ఈ ప్రాంతం మారుమ్రోగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావుతో పాటు ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబులు ధర్నాకు హాజరై సంఘీబావం తెలిపారు. మహాధర్నా సందర్భంగా జరిగిన సభకు వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. శివనాగమణి అధ్యక్షత వహించారు. సభలో వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐడబ్య్లూయు) అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంపై దాడి చేస్తోందన్నారు. ఉపాధి పనుల నిర్వహణపై అనేక ఆంక్షలు పెడుతోందని చెప్పారు. ఉపాధి పనుల్లో మెటీరియల్ కాంపోనెంట్ నిధులను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచి యంత్రాల పనులుగా మార్చేసిందని, ఏడాది కాలంలోనే దేశంలో ఆరు కోట్ల జాబ్ కార్డులు రద్దు చేసిందని తెలిపారు. ఏటా కేంద్ర బడ్జెట్ సైజ్ పెరుగుతున్నా మూడేళ్లుగా ఉపాధి చట్టానికి కేటాయింపులు పెంచలేదని, రూ. 86 వేల కోట్లు మాత్రమే కేంద్రం కేటాయిస్తోందని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పెరగడంతో కార్మికుల పని దినాలు 34 రోజులకు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, అగ్రవర్ణ పేదల్లో 55 శాతం మంది ఉపాధి పనులు చేస్తున్నారని, ఉపాధి హామీకి రూ. 2.5 లక్షల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ చట్టానికి నిధులు పెంచితే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఉపాధి హామీ చట్టంపై రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధి పనులకు ఎక్కువ నిధులు తెచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. కేటాయింపులు పెంచకుంటే రాబోయే రోజుల్లో ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో వామపక్షాలు బలపడితే వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు, పేద రైతులు, కౌలు రైతులు హక్కులు పరిరక్షించబడతాయని చెప్పారు. యుపిఎ 1 హయాంలో వామపక్షాల చొరవతోనే ఉపాధి హామీ చట్టం కేంద్రం తీసుకు వచ్చిందని గుర్తు చేశారు. వామపక్షాలు అధికారంలో వున్న కేరళలో వ్యవసాయ కార్మికులకు సంక్షేమ చట్టం ఉందని తెలిపారు. ఉపాధి పని ఉంటే వ్యవసాయ కార్మికులకు కూలి కోసం బేరమాడే శక్తి వుంటుందని అన్నారు. అందుకే ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం చూస్తోందన్నారు. రాష్ట్రంలో 13 లక్షలు జాబ్ కార్డులు తగ్గించారన్నారు. మరింతగా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఉపాధి చట్టాన్ని పరిరక్షించుకునేందుకు , డిమాండ్ల సాధనకు వ్యవసాయ కార్మిక సంఘం చేసే ఆందోళనలు, పోరాటాలకు సిపిఎం అండగా నిలుస్తుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 100 రోజులు ఉపాధి పని పూర్తి చేసుకున్న గ్రామీణ పేదలకు అదనంగా పని దినాలు కల్పించాలన్నారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలన్నారు. సమ్మర్ అలవెన్స్ 30 శాతం కలపాలని, ప్రతి వారం ప్లే స్లిప్‌లు ఇవ్వాలన్నారు. వలస కార్మికులకు గుర్తింపు కార్డులిచ్చి ఉచిత రవాణా సదుపాయం కల్పించాలన్నారు. ప్రమాదాల్లో చనిపోయిన కార్మికులకు బీమా సౌకర్యం రూ. 25 లక్షల నగదు, రెండు ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆధార్ అనుసంధాన పేమెంట్ పథకాన్ని రద్దు చేయాలని, రోజు కూలిని రూ. 600కు పెంచాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌లు పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయాలు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్య.కా.స రాష్ట్ర నాయకులు అన్వేష్, ఎం. పుల్లయ్య, అంకణాల ఆంజనేయులు, ఎం.కృష్ణమూర్తి, కోట కల్యాణ్, ఇ. అప్పారావు, పిల్లి రామకృష్ణ, జె.సత్యనారాయణ, ఎ.శ్రీనివాసు, ఈశ్వరరావు, పిల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.