ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకులను ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, అధికారులు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం అనితరసాధ్యమని కొనియాడారు.
గుంటూరులో పొట్టిశ్రీరాములు విగ్రహానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు జి.మాధవి, బి.రామాంజనేయులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఉద్యమించిన మహనీయుడి ఆశయ సాధనకు కృషి చేయడమే అమరజీవికి మనమిచ్చే నివాళి అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మినారాయణ పాల్గన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పొట్టి శ్రీరాములుకు మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు. అమరజీవి ఆశయ సాధన కోసం పునరంకితమవుదామని తెలిపారు. నంద్యాలలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ నివాళుల్పంచారు. తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. కర్నూలు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్‌ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.భరత్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ పాల్గన్నారు. శ్రీకాకుళం నగరంలోని పాత బస్టాండ్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆమదాలవలస, నరసన్నపేట ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి నివాళుర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు ఆయా జిల్లాల కలెక్టర్లు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
