- వైసిపి సభ్యుల పట్ల స్పీకర్ అసహనం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. శాసనసభలో గురువారం కర్నూలులో గ్రీన్‌కో ప్రాజెక్టుపై వైసిపి సభ్యులు అడిగిన ప్రశ్న చర్చకు వచ్చిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. సభ్యులు నేరుగా సమావేశాలకు రావచ్చని, అలా కాకుండా ఇలా వ్యవహరించడం వారి స్థాయిని తగ్గిస్తుందే కానీ, గౌరవ పెంచదని చెప్పారు. ప్రశ్నలు వేసి సభకు రాకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభకు రాకుండా సంతకం పెట్టినట్లు తమ దృష్టికి వచ్చిన వారిలో వైసిపి శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డి , తాటిపర్తి చంద్రశేఖర్, వేగం మత్స్యలింగం, అమర్‌నాధ్‌రెడ్డి, దాసరిసుధ, బి.విరూపాక్షి, విశ్వేశ్వరరాజులు ఉన్నారన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వీరందరూ పలు తేదీల్లో సంతకాలు పెట్టి వెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా వ్యవహరించడం వల్ల సభ్యులకు గౌరవం తగ్గుతుందన్నారు. సభకు రాకుండా సంతకాలు పెట్టి వెళ్లిన వారి పేర్లను ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని జనసేన అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్పీకర్‌కు సూచించారు. ఉద్యోగి సంతకంపెట్టి విధులకు హాజరుకాక పోతే సస్పెండ్ చేస్తారని, సభకు రాకుండా సంతకాలు పెట్టిన వారిని ఏమి చేయాలా మీరే నిర్ణయం తీసుకోవాలని కోరారు. సభా నియమాలను పరిశీలించి , ఎథిక్స్ క మిటీకి సిఫారసు చేస్తామని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.