సంతకాలు పెట్టాం… వెనక్కి తీసుకోం

సెకీ ఒప్పందంపై అసెంబ్లీలో చంద్రబాబు
రాబోయే నాలుగేళ్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని హామీ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ‘సెకి ఒప్పందంంపై సంతకాలు పెట్టాం. ఒకసారి సంతకాలు చేసిన తరువాత వెనక్కి తీసుకుంటే పెనాల్టీలు కట్టాలి. దాంతోపాటు విశ్వసనీయత పోతుంది. అందుకే వెనక్కి తీసుకోలేం’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం నాడు విద్యుత్‌రంగంపై స్పల్ప కాలిక వ్యవధి చర్చ జరిగింది. చర్చలో భాగంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు సెకి ఒప్పందంతోపాటు, పవర్‌ సప్లరు అగ్రిమెంటు కూడా రాష్ట్రానికి భారంగా మారిందని చెప్పారు. అయినా, దానిని సాకుగా చూపి వెనక్కిరావడానికి తాను సిద్ధంగా లేనని చెప్పారు. అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చామని, ఆ మాటకు కట్టుబడి రానున్న నాలుగేళ్లు ఛార్జీలు పెంచబోమని చెప్పారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019-24 సంవత్సరాల మధ్య కాలాన్ని విద్యుత్‌ రంగానికి చీకటి రోజులుగా ఆయన అభివర్ణించారు. మొత్తం వ్యవస్థను గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని చెప్పారు. దానిని తొమ్మిది నెలల్లో గాడిలో పెట్టామని అన్నారు.
క్లీన్‌ ఎనర్జీ పాలసీ పూర్తయ్యాక రూ.5.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయులు కుదుర్చుకున్నామని చెప్పారు. దీనిద్వారా రాష్ట్రంలో రూ.3.66 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని, రాబోయే ఐదేళ్లలో రూ.10 లక్షలకోట్ల పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గతంలో రైతుల ఇబ్బందులు చూసి పగటిపూటే తొమ్మిది గంటల విద్యుత్‌ ఇచ్చామని చెప్పారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత తనదేనని ఆ తరువాత కరెంటు కొరతను అధిగమించామని చెప్పారు. 2004లో విద్యుత్‌ యూనిట్‌ రూ.2.55 పైసలు ఉంటే 2014 నాటికి రూ.5.25 పైసలకు పెంచారని సిఎం చెప్పారు. దీంతో వినియోగదారులపై మోయలేని భారం పడిందని పేర్కొన్నారు. గంటలకొద్దీ కోతలు విధించే పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు 2019లో అధికారంలోకి వచ్చిన ఓ వ్యక్తి అహం వల్ల రాష్ట్రం దెబ్బతినిపోయిందని తెలిపారు. గత ఐదేళ్లలో తొమ్మిదిసార్లు ధరలు పెంచి రూ.32 వేల కోట్ల భారం ప్రజలపై వేశారని అన్నారు. పోలవరం హైడ్రోపవర్‌ ఆలస్యం వల్ల రూ.1,044 కోట్లు భారం పడుతుందని చెప్పారు. రూ.62,826 కోట్లు ఉన్న అప్పు రూ.1.12 కోట్లకు పెరిగిందని చెప్పారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన తనకే విద్యుత్‌ బాదుడుకు పెట్టిన పేర్లు అర్థం కావడం లేదని వివరించారు. ఫ్యూయల్‌ ఛార్జీల పేరుతో రూ.5,886 కోట్లు, టారిఫ్‌ పేరుతో రూ.3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో రూ.5,604 కోట్లు భారం వేశారని తెలిపారు. 2019-24 మధ్య రూ.32,166 కోట్ల భారం మోపడంతోపాటు రూ.2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.6,073 కోట్లు, రూ.2023-24లో రూ.6,544 కోట్లు ఎప్‌పిపిఎస్‌ఎ ఛార్జీల వసూలుకు ఎపిఇఆర్‌సిలో పిటీషన్‌ వేశారని అన్నారు. గత ప్రభుత్వం పెంచిన భారమే గతేడాది అక్టోబర్‌, నవంబరు నెలల్లో ప్రజలపై పడిందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 10 వేల రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామన్నారు.

➡️