ప్రజాశక్తి- తిరుపతి సిటీ : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం ఏడు తలల పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథునిగా అమ్మవారిని అలంకరించారు. కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారిని ఆలయ మాఢ వీధుల్లో ఊరేగించారు. ఆలయ అధికారులు మాట్లాడుతూ… శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు, లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తారని తెలిపారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై ఊరేగించారు. పెద్దశేష వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఇఒ జె శ్యామలరావు, జెఇఒలు వీరబ్రహ్మం, గౌతమి, ఆలయ డిప్యూటీ ఇఒ గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి పాల్గొన్నారు.