ప్రజాశక్తి – పాచిపెంట (పార్వతీపురం మన్యం జిల్లా) : నేల బావిలో దూకి అక్కాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. బొర్రమామిడి పంచాయతీ బొడ్డపాడుకు చెందిన సేబి సోంబారమ్మ (24)కు అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహం కుదిరింది. గత వారం రోజులుగా ఆ జంట మధ్య మనస్పర్ధలు రావడంతో సోంబారమ్మ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తాను బతకనని, చనిపోతానంటూ వరుసకు చెల్లెలు పోయి లక్ష్మి (18)కి చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. నీవు లేకపోతే తాను కూడా బతకనని, ఇద్దరం కలిసే చనిపోదామని సోమవారం రాత్రి గ్రామ సమీపంలోని నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బావిలో తేలియాడుతున్న మృతదేహాలు స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఎస్సై పి.నారాయణరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సిహెచ్‌సి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
