శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యిపై దర్యాప్తు ముమ్మరం

  • త్వరలో సిబిఐ డైరెక్టర్‌కు నివేదిక

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై దర్యాప్తును స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం (సిట్‌) ముమ్మరం చేసింది. చెన్నైలోని దిండిగల్‌లోని ఎఆర్‌ డెయిరీలో ఆదివారం విచారణ చేపట్టింది. సోమవారం తిరుపతి భూదేవి గెస్ట్‌హౌస్‌కు చేరుకుని ఫైళ్లను సిట్‌ బృందం సభ్యులు పరిశీలించారు. రెండు నెలల క్రితం శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో నిజనిజాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు డిఐజిలు సర్వశ్రేష్ట త్రిపాఠి, గోపీనాథ్‌జెట్టి, నలుగురు డిఎస్‌పిలు, ఇద్దరు సిఐలతో సిట్‌ను ఏర్పాటు చేసింది. వైసిపి నేత, టిటిడి మాజీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి… సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించకూడదని, ఆధారాలు లేకుండా మాట్లాడడం సరైంది కాదని రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ..సిట్‌ దర్యాప్తుకు తాత్కాలికంగా నిలిపివేస్తూ తీర్పు చెప్పిన విషయం విదితమే. ఈ సంఘటనపై స్వతంత్ర దర్యాప్తుతో పాటు సిబిఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ కొనసాగించాలని ‘సిట్‌’ను సిబిఐ ఆదేశించింది. సిట్‌ డిఎస్‌పిలు సీతారామ ఆంజనేయులు, శివనారాయణస్వామి, కృష్ణమోహన్‌, వెంకటరామయ్య విచారణ చేపడుతున్నారు. త్వరలోనే నివేదికను సిబిఐ డైరెక్టర్‌ వీరేష్‌ ప్రభుకు అందజేయనున్నారు.

➡️