‘సిట్‌’ దర్యాప్తు ప్రారంభం

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) శనివరాం దర్యాప్తు ప్రారంభించింది. తిరుమలకు ఎఆర్‌ డెయిరీ మిల్క్‌ ఫుడ్స్‌ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందంటూ తిరుపతి ఈస్టు పోలీస్‌ స్టేషన్లో టిటిడి మార్కెటింగ్‌ జిఎం మురళీకృష్ణ ఇటీవల ఇచ్చిన ఫిర్యాదు కాపీని సిట్‌ బృందం తీసుకుంది. ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా మార్కెటింగ్‌ విభాగం రికార్డులను ఈ బృందం పరిశీలించనుంది. సిట్‌ సభ్యులు మూడు బృందాలుగా ఏర్పడి.. ఒక బృందం తిరుమలలోనూ, మరో బృందం తిరుపతిలోనూ, ఇంకో బృందం చెన్నరులోనూ దర్యాప్తు చేయనుంది. టిటిడి ఇఒ శ్యామలరావు, అదనపు ఇఒ వెంకయ్యచౌదరితో అదివారం సమావేశం కానున్నట్లు సమాచారం. తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఎఆర్‌ డెయిరీ మిల్క్‌ ఫుడ్స్‌ సంస్థ నుంచి నెయ్యి అందిందని ఫిర్యాదులో ఉన్నందున చెన్నరుకు ఒక బృందం వెళ్లనుంది. తిరుమల లడ్డూ పోటులోనూ విచారణ జరపనుంది. గత ఐదేళ్లలో వైసిపి హయాంలో జరిగిన నెయ్యి కొనుగోళ్ల రికార్డులను పరిశీలించనుంది. ఏ ప్రభుత్వ హయాంలో ఎన్ని ట్యాంకర్ల నెయ్యి సరఫరా అయ్యింది, ఎంత నాణ్యత ఉంది, ఎన్ని ట్యాంకర్లను ఏయే కారణాలతో తిప్పి పంపారు తదితర అంశాలపై విచారించనుంది. మైసూర్‌ ల్యాబ్‌ ఇచ్చిన నెయ్యి నాణ్యత రిపోర్టును పరిశీలించనుంది. ఈ బృందానికి సారథ్యం వహిస్తోన్న సిట్‌ చీఫ్‌, గుంటూరు రేంజి ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠిని మీడియా ప్రతినిధులు కలవగా, దర్యాప్తు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ బృందంలో విశాఖ రేంజి ఐజి గోపినాథ్‌జెట్టి (టిటిడి మాజీ విజిలెన్స్‌ అధికారి), కడప ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు, తిరుపతి అదనపు ఎస్‌పి వెంకట్రావు, డిఎస్‌పిలు జి.సీతారామారావు, శివనారాయణస్వామి ఉన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు తిరుపతి వచ్చిన సిట్‌ బృందం తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం టిటిడి ఇఒ శ్యామలరావును కలిసింది.

➡️