వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలో కేసుల విచారణ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ాసిట్)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం జిఓ ఆర్‌టి నెంబరు 2103ను విడుదల చేసింది. ఈ బృందానికి సిఐడి ఐజి వినీత్ బ్రిజిలాల్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, ఆయనతోపాటు ఇందులో సిట్ ఎస్‌పి ఉమామహేశ్వర్, డిఎస్‌పిలు గోవిందరావు, అశోక్ వర్థన్, రత్తయ్య, బాలసుందరరావును సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం అక్రమ
రవాణా అవుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి 13 ఎఫ్‌ఐఆర్‌లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా కేసులపై విచారణ జరిపి ప్రతి 15 రోజులకోసారి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సిట్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి సిట్ బృందానికి ప్రత్యేక అధికారాలను కల్పించింది. తనిఖీలు, జప్తులు, అరెస్టులు చేసేందుకు కూడా అవకాశం ఇచ్చింది. సిట్‌కు అవసరమైన సమాచారం ఇవ్వాలని డిజిపి, హోంసెక్రటరీకి సిఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ సూచించారు.