తెరపైకి మరో సారి ‘సిట్‌’

Jun 8,2024 01:45 #once again, #screen, #sit
assigned housing lands

విశాఖ భూకుంభకోణాలు నివేదికలు బహిర్గతమయ్యేనా?
జవహర్‌రెడ్డిపై అసైన్డ్‌ ఆరోపణలు నిగ్గుతేలేనా?
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :సిఎస్‌ డాక్టర్‌ జవహర్‌రెడ్డి బినామీల పేరుతో ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున అసైన్డ్‌ భూములు కొనుగోలు చేశారని విశాఖపట్టణానికి చెందిన జనసేన కార్పొరేటర్‌ పివిఎల్‌ఎన్‌ మూర్తి తాజాగా చేసిన ఆరోపణలతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టించాయి. వీరితో పాటు బ్యూరోక్రాట్స్‌ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సిఎస్‌తో పాటు వైసిపిలోని ఓ కీలకనేత కూడా అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఉన్నాడనే వార్త రాష్ట్రవ్యాప్తంగా దుమారం లేపింది. ఈ విషయంపై వాస్తవాలను నిగ్గు తేల్చాలనే పట్టుదలతో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 12న ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం వారం పది రోజుల్లో భూకుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చేందుకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)ను వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి నేతృత్వంలో దర్యాప్తు చేయించాలా? లేక సిట్టింగ్‌ హైకోర్టు జడ్జి ద్వారా చేయిస్తే బాగుంటుందా? అనే అంశం ఈ వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో మిలిటరీ ఉద్యోగులకు ఇచ్చిన అసైన్డ్‌భూములు, పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములను ధర్మాన రెవెన్యూమంత్రిగా పనిచేసే కాలంలో తమకు అనుకూలంగా మార్చుకున్నారనే ఆరోపణలతో రాష్ట్రం విడిపోయిన తర్వాత టిడిపి ప్రభుత్వం సిట్‌ను నియమించింది. 2019లో వైసిపి అధికారంలోకి రాగానే విశాఖ భూముల కుంభకోణంలో టిడిపి నేతల పాత్ర ఉందంటూ మరోసారి సిట్‌ను నియమించారు. నేటికీ ఆ నివేదిక వెలుగులోకి రాలేదు. దసపల్లా హిల్స్‌కు చెందిన భూములను వైసిపి పెద్దలు ఆక్రమించారంటూ 2023లో జనసేన, బిజెపి ఆరోపించింది. విశాఖ భూముల కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చేందుకు సిబిఐతో విచారణ చేయించాలని గతంలో మాజీమంత్రి బండారు సత్యనారాయణ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈసారైనా సిట్‌ నివేదికలు బహిర్గతమై, చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందా? అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

➡️