Polling violence: దర్యాప్తు లోపభూయిష్టం

  • ఎన్నికల హింసపై డిజిపికి సిట్‌ నివేదిక
  •  33 చోట్ల హింసాత్మక ఘటనలు
  •  1370మంది నిందితులు
  •  పలు కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్లు మార్పునకు ప్రతిపాదన

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై జరిగిన పోలీస్‌ దర్యాప్తులో అనేక లోపాలు చోటుచేసుకున్నట్లు సిట్‌ నిర్ధారించింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ , డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తాకు సోమవారం అందించారు. 150 పేజీల ఈ నివేదికలో అల్లర్లు, హింసకు సంబంధించిన కేసుల దర్యాప్తులో అనేక లోపాలున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి అనేక అంశాలను వివరించారు. వీటిన కూడా పరిగణలోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్‌లో మరికొన్ని సెక్షన్లు చేర్చాలని ప్రతిపాదించారు. ఏయే సంఘటనల్లో ఏయే సెక్షన్లు చేర్చవచ్చో కూడా వివరించినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా ఆయా ప్రాంతాల్లో సంఘటన ఎలా జరిగింది? ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులెవరు? సంఘటన జరగకుండా ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? సంఘటన జరుగుతున్న సమయంలో అల్లర్లు జరగకుండా తీసుకున్న చర్యలేమిటీ? ఘటనలకు సంబంధించి ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు చేశారు? ఏయే సెక్షన్లు వేశారు? అసలైన నిందితులను కేసులో పెట్టారా? లేక రాజకీయ వత్తిళ్లలకు లొంగి వారిచ్చిన పేర్లను కేసుల్లో ఇరికించారా? లాంటి విషయాలన్నింటిని స్ధానికులు, పోలీసులనుంచి వివరాలు రాబట్టిన సిట్‌ ఆ అంశాలను కూడా నివేదికలో పొందుపరిచింది. పల్నాడు , అనంతపురం, తిరుపతి మూడు జిల్లాల్లో ఈ సంఘటనలకు సంబంధించి 33 కేసులు నమోదయ్యాయని, వీటిలో మొత్తం 1370మంది నిందితులుగా ఉన్నారని ఆ నివేదికలో పొందుపరిచారు. ఈ మొత్తం నిందితుల్లో ఇప్పటి వరకు 124మందిని అరెస్ట్‌ చేయగా, 1152మందిని అరెస్ట్‌ చేయాల్సి ఉందని, మరో94మందికి 41-ఎ కింద నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు.
ప్రాధమికంగా అందిన సమాచారం మేరకు పలు కేసుల్లో నిందితుల జాబితా పెరిగే అవకాశమున్నట్లు స్పష్టమవుతోంది. వీరిలో పలువురు అజ్ఞాతంలో ఉండటంలో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కూడా సూచించినట్లు సమాచారం. దర్యాప్తులో లోపాలు స్పష్టం కావడంతో సంబంధిత పోలీస్‌ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌తోపాటు 12 మందితో కూడిన ఈ దర్యాప్తు బృందంలో ఒక అడిషనల్‌ ఎస్‌పి, నలుగురు డిఎస్‌పిలు, ఏడుగురు పోలీస్‌ ఇనెస్పెక్టర్లు, ఒక న్యాయసలహాదారుడుతో సహా 4 టీమ్‌లు పాల్గొన్నాయి. ఒక్కో టీమ్‌కు డిఎస్‌పి నేతృత్వం వహించారు. పల్నాడు జిల్లాకు రెండు బృందాలు, అనంతపురానికి ఒక బృందం, తిరుపతికి ఒక బృందాన్ని నియమించారు.

సిట్‌ బృందంతో సమన్వయంతో ముందుకు సాగాలి: డిజిపి
సిట్‌ బృందంతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిజిపి హరీష్‌కుమార్‌గుప్తా సోమవారం సంబంధిత జిల్లాల ఎస్‌పిలు, ఎస్‌ఎస్‌పి, అనంతపురం డిఐజి, గుంటూరు ఐజిలను ఆదేశించారు.

➡️