వైభవంగా సీతారాముల కల్యాణం

పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి-కడప ప్రతినిధి/ఒంటిమిట్ట : నవ్యాంధ్ర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్టలో శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా హాజరై స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. టిటిడి అర్చకు శాస్త్రోక్తంగా కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ సీతారాముల విగ్రహాల శిరస్సులపై జీలకర్ర, బెల్లం పెట్టారు. సీతమ్మ వారి మెడలో మగళసూత్రాన్ని ధరింపజేశారు. స్వామివారు సీతమ్మపై ముత్యాల తలంబ్రాలు పోసే సన్నివేశాన్ని వేదపండితులు వర్ణించారు. కడప రోడ్డులో విశాలమైన మైదానంలో భారీ పందిళ్లువేసి పూల పరిమళాలు, విద్యుత్‌ కాంతులు, విద్యుత్‌ దీపాలతో కల్యాణ వేదికను అలకరించారు. అంతకు మునుపు శ్రీ సీతారాముల స్వామివారిని ఆలయం నుండి ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. వేదపండితులు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. మా వంశం గొప్పదంటే మా వంశమే గొప్పదని వేదపండితులు కొంతమంది సీతమ్మ వైపు, మరికొందరు రామయ్య వైపు చేరి వేడుక నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా భారీ ఏర్పాట్లు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించారు. ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ విశిష్టత, రాములవారి ప్రాశస్త్య్రం, సీతారాములకు చేయించిన బంగారు ఆభరణాల గురించి వివరించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లా, రాష్ట్ర నలుమూల నుండి యాత్రికులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత, రవాణా శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి, టిటిడి చైర్మన్‌ బిఆర్‌.నాయుడు, టిటిడి ఇఒ శ్యామలరావు, టిటిడి జెఇఒ వీరబ్రహ్మం, టిటిడి బోర్డు సభ్యులు ఎంఎస్‌.రాజు, జ్యోతుల నెహ్రూ, భాను ప్రకాష్‌రెడ్డి, ఎంపీ సిఎం రమేష్‌, కడప జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, ఎస్‌పి ఇజి.అశోక్‌కుమార్‌, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గన్నారు.

శివధనుర్భాలంకారంలో కోదండరాముడు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శివధనుర్భాలంకారంలో రాములవారిని ఊరేగించారు. చెక్కభజనలు, కోలాటాలు, కేరళ డ్రమ్స్‌ నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది.

సీత, రామ, లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు
సీత, రామ లక్ష్మణులకు రూ.6.60 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను పెన్నా సిమెంట్స్‌ అధినేత పి.ప్రతాప్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు విరాళంగా అందించారు. దాదాపు ఏడు కేజీల బంగారంతో తయారు చేసిన కిరీటాలను టిటిడి చైర్మన్‌ బిఆర్‌ నాయుడు, ఇఒ జె.శ్యామలరావులకు అందజేశారు.

➡️