పాకల తీరంలో నలుగురు గల్లంతు

  • మూడు మృతదేహాలు వెలికతీత
  • మరొకరి కోసం గాలింపు

ప్రజాశక్తి-శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : సముద్రతీరానికి వచ్చిన పర్యాటకులను అలల రాకాసి కబళించింది. ఒక్కసారిగా వచ్చిన అలలకు నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. వీరికి కూతవేటు దూరంలోనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గల్లంతయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలం, పాకల తీరంలో జరిగింది.
పొన్నలూరు మండలం, శివన్నపాలెం గ్రామానికి చెందిన నాసిన మాధవ (26), ఆయన సతీమణి నవ్య, మాధవ సోదరి నాసిన జోషిక (16), మాధవ బంధువు కొండా బత్తిన యామిని (19) కలిసి సరదాగా పాకల సముద్ర తీరానికి వచ్చారు. నలుగురూ సముద్రం ఒడ్డున ఆడుకుంటుంగా అలల తాకిడికి ఒక్కసారిగా కొట్టుకుపోయారు. వీరిలో మాధవ, జోషిక, యామిని అక్కడికక్కడే మృతిచెందారు. మాధవ సతీమణి నవ్యను మెరైన్‌ పోలీసులు, మత్స్యకారులు కాపాడారు. ముగ్గురి మృతదేహాలను కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

పెళ్లయిన మూడు నెలలకే..

పొన్నలూరు మండలం, శివన్నపాలెం గ్రామానికి చెందిన నాసిన మాధవ (26), ఆయన సతీమణి నవ్యకు వివాహమై మూడు నెలలైంది. సంక్రాంతి సందర్భంగా మాధవ దంపతులు శివన్నపాలెం గ్రామం నుంచి అత్తగారి ఊరైన కొల్లగుంట గ్రామానికి వచ్చారు. సరదాగా సముద్ర తీరానికి వెళ్లారు.కళ్ల ముందే భర్తను కోల్పోవడంతో నవ్య కన్నీటి పర్యంతమయ్యారు.

కూతవేటు దూరంలోనే..

ఈ నలుగురు గల్లంతైన ప్రాంతానికి కూత వేటు దూరంలోనే సముద్రంలో మునుగుతున్న శింగరాయకొండ గ్రామపంచాయతీలోని శ్రీరాంనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తమ్మిశెట్టి పవన్‌ (21) అలల తాకిడికి కొట్టుకుపోయారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు. మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎస్‌పి ఏ ఆర్‌ దామోదర్‌, ఒంగోలు ఆర్‌డిఒ ప్రసన్నలక్ష్మి, ఒంగోలు డిఎస్‌పి రాయపాటి శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

➡️