- ప్రజారోగ్య వేదిక డిమాండ్
ప్రజాశక్తి – హెల్త్ యూనివర్సిటీ (విజయవాడ అర్బన్) : ప్రజలకు అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు, మందులు, సిబ్బందిని అందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను, జిల్లా ఆస్పత్రులను బలోపేతం చేయాలని.. రాష్ట్ర బడ్జెట్లో కనీసం 6 శాతం నిధులు ఆరోగ్య రంగానికి కేటాయించాలని ప్రజారోగ్య వేదిక రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్య వేదిక (జన స్వస్త్ అభియాన్) ఆధ్వర్యాన ‘ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య బడ్జెట్ – ప్రజారోగ్యం” అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ప్రజారోగ్య రంగంలోని ప్రజాసంఘాలు, పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవి.రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బి.హనుమయ్య మాట్లాడుతూ ఆరోగ్యశ్రీని ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తే సామాన్యులకు వైద్య సేవలు మరింత దూరమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రయివేటీకరించడమే అవుతుందన్నారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 31.2 శాతం మంది ఐదేళ్లలోపు పిల్లల్లో సరైన శారీరక మానసిక ఎదుగుదల లేదని, 29.6 శాతం మందిలో ఎత్తుకు తగిన బరువు లేరని, 54 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లల్లో బరువు తక్కువ పిల్లలు రాష్ట్రంలోనే అత్యధిక మంది ఉన్నారని, ఇది గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపం తీవ్రతను సూచిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ సరిపడా సిబ్బంది, పరికరాలు, మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో సిపిఐ ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.వి.ఆంజనేయులు, ప్రజారోగ్య వేదిక ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి జి.విజయ ప్రకాష్, ఐద్వా నాయకులు రమాదేవి తదితరులు మాట్లాడారు.