SLBC: విషాదాంతం

Mar 9,2025 23:13 #SLBC Tunnel

టన్నెల్‌లో బయటపడిన మృతదేహం
టిబిఎం ఆపరేటర్‌ గురుప్రీత్‌ సింగ్‌గా గుర్తింపు
మరో ఏడుగురి కోసం అన్వేషణ
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో : ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మందిలో ఒకరి మృతదేహం ఆదివారం బయటపడింది. కేరళ నుంచి రప్పించిన కడావర్‌ డాగ్స్‌, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ ఆర్మీ, నేవీ బృందాల సమిష్టి కృషితో మట్టి దిబ్బల కింద మనుషుల ఆనవాళ్లు గుర్తించారు. సహాయక బృందాలు వారిని వెలికితీసేందుకు పూర్తి స్థాయిలో సాంకేతికత, శక్తి సామర్ధ్యాలను ఉపయోగిస్తున్నాయి.. కేరళ శునకాలు పసిగట్టిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి ఆదివారం సాయంత్రం ఒక మృతదేహాన్ని బయటకు తీశాయి. 16 రోజులుగా బురదలో కూరుకుపోయి ఉండడంతో శరీరమంతా ఉబ్బి గుర్తుపట్టలేని విదంగా తయారైంది. చేతికి ఉన్న కడియం ఆధారంగా ఆ మృతదేహం టిబిఎం మిషన్‌ ఆపరేటర్‌ గురుప్రీత్‌ సింగ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. సింగ్‌ మృతదేహం గుర్తించిన ప్రాంతంలోనే మిగిలిన వారు ఉండొచ్చని ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు. సొరంగంలో గల్లంతైన ఎనిమిది మంది ఎప్పుడూ కలిసి ఉండే వారని, ఈ ప్రమాదంలో వీరందరూ కలిసే చనిపోయి ఉంటారని తోటి కార్మికులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక మృతదేహాన్ని వెలికితీయడంతో సొరంగ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 16 రోజుల క్రితం ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ ప్రమాదం జరిగింది. అందులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 12 ఏజెన్సీలకు చెందిన సహాయక బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. సొరంగం లోపల పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో పూర్తి స్థాయి సాంకేతికతను ఉపయోగించి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. కార్మికులు గల్లంతైన ప్రదేశంలో 15 అడుగుల మేర మట్టి, బురద మేట వేయడంతో వారిని గుర్తించేందుకు కేరళ నుంచి కడావర్‌ డాగ్స్‌ మాయ, మర్పినిలను తీసుకొచ్చారు. అవి మానవ ఆనవాళ్లను గుర్తించడంతో ఆ ప్రదేశంలో తవ్వకాలు జరిపి ఒక మృతదేహాన్ని వెలికితీశారు. రెండు రోజుల్లో ఎస్‌ఎల్‌బిసి సొరంగం ఆపరేషన్‌ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో మరో మృతదేహం ఆనవాళ్లు గుర్తించినట్టు సమాచారం.

➡️