ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల భర్తీ సామాజిక న్యాయానికి అద్దం పడుతుందని మాజీమంత్రి కెఎస్ జవహర్ తెలిపారు. ఎస్సి,ఎస్టి, బిసిలు ఆర్ధికంగా, రాజకీయంగా పైకి ఎదగాలని ఆకాక్షించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీకోసం కష్టపడిన వారిని ఆయన ఎప్పుడూ వదులుకోరని, పార్టీ కార్యకర్తకు మించి పెద్ద పదవి ఉండదన్నారు.
టిడిపి కార్యాలయానికి ‘కోడికత్తి’ శ్రీను
మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్నంలో జరిగిన హత్యాయత్నం కేసు బాధితుడు జనుపల్లి శ్రీనివాసరావు అతని కుటుంబంతో కలిసి సోమవారం టిడిపి కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను కలిశారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి లోకేష్‌ను కలిసి సమస్యను చెప్పుకోగా అధికారంలోకి వచ్చిన తరువాత ఆదుకుంటామని హామీ ఇచ్చారని శ్రీను కుటుంబ సభ్యులు రామయ్యకు తెలిపారు. తమ గోడు సిఎంకు చెప్పుకునేందుకు వచ్చామని తెలిపారు. శ్రీనివాస్ కుటుంబం ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుందని న్యాయవాది సలీమ్ వివరించారు. అతని కుటుంబ సభ్యులకు ఏదైనా ఉద్యోగం కల్పించి అండగా నిలవాలని కోరారు.
