ప్రైవేటురంగంలో రిజర్వేషన్లతో సామాజిక న్యాయం

  • అంబేద్కర్‌కు నివాళిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
  • స్మృతి వనాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని నినాదాలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే బాబాసాహెబ్‌ డాక్టర్‌ బి.అర్‌.అంబేద్కర్‌ కలలుగన్న సామాజికన్యాయం జరుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆయన స్ఫూర్తితో అంటరానితనం, సామాజిక అసమానతల నిర్మూలనకు, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలు కోసం పెద్దఎత్తున పోరాటం నిర్వహిస్తామని తెలిపారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సోమవారం స్మృతివనంలో విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్మృతివనాన్నిప్రభుత్వమే నిర్వహించాలని, ఆ మేరకు నిధులు కేటాయించాలని, పిపిపి పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. నివాళి అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ అంటరానితనం, వివక్షత అంతం కావాలని, సామాజిక న్యాయం జరగాలని, ప్రతి ఒక్కరికీ విద్య, ఉద్యోగం, ఉపాధి ఉంటేనే సామాజికాభివృద్ధి జరుగుతుందని అంబేద్కర్‌ ఆశించారని తెలిపారు. కానీ నేటి పాలకుల విధా నాలు వాటికి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. పేదలకు పంచాల్సిన భూములను పెట్టుబడిదారుల కు ఇస్తున్నారని, వాటిల్లో యువతకు ఉపాధి కల్పిం చడం లేదని, అభివృద్ధి చేయడం లేదని, పరిశ్రమలు పెట్టడం లేదని అన్నారు. ప్రభుత్వం నుండి పొందిన భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. దీనివల్ల పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా ఉపాధి కోసం ఎదురు చూస్తూ పేదరికంలో బతుకులీడుస్తున్నారని అన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో భూస్వామ్య పెత్తందారీ పోకడలు, దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. దళితవాడలకు సరైన రోడ్లు, సదుపాయాలు, శ్మశానవాటికలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అంబేద్కర్‌ స్మృతివనం ప్రజల అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకునేలా ఉండాలని, దానికి విరుద్ధంగా ఇక్కడ ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో ప్రభుత్వాలే నిర్దేశిస్తే ఎలాగని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అంబేద్కర్‌ విగ్రహాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించిందని, ఇప్పటి ప్రభుత్వం దీన్ని వ్యాపారకేంద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వమే అభివృద్ధి చేయడంతోపాటు ప్రజల హక్కుల సాధనకు వేదికగా మార్చాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంబేద్కర్‌ దేశ సంపదను జాతీయం చేయాలని కోరుకుంటే నేటిపాలకులు జాతీయ సంపదను ప్రైవేటుపరం చేస్తున్నారని అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కె.శ్రీదేవి, బి.రమణ మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కె.ప్రభాకరరెడ్డి, విజయవాడ కార్పొరేషన్‌ సిపిఎం ఫ్లోర్‌లీడర్‌ బోయి సత్యబాబు, నాయకులు ఎం.హరిబాబు, గుండిమెడ క్రాంతికుమార్‌, జి.నటరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు….పోలీసులు హెచ్చరిక

అంబేద్కర్‌ విగ్రహానికి సిపిఎం నాయకులు నివాళి అర్పించేందుకు వెళుతుండగా అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. జెండాలు పట్టుకెళ్లడానికి వీళ్లేదని అన్నారు. . తాము నివాళి అర్పించి వస్తామని, రాజకీయాలు కాదని సిపిఎం నాయకులు తెలిపారు. అయినా పోలీసులు పార్టీ జెండాలు పట్టుకెళ్లడానికి వీల్లేదని అనడంతో, తాము అలాగే వెళతామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. తాము అసలు ఏమి చెబుతామో తెలియకుండా ఏమి మాట్లాడాలో మీరెలా నిర్ణయిస్తారని శ్రీనివాసరావు ప్రశ్నించారు. స్వల్ప వాగ్వివాదం అనంతరం నాయకులు ప్రదర్శనగా విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు.

➡️