- మాజీ రాష్ట్రపతి కెఆర్.నారాయణన్ ఒఎస్‌డి ఎస్‌ఎన్ సాహు
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో మార్పు జరగాలంటే కులగణన అవశ్యమని మాజీ రాష్ట్రపతి కెఆర్.నారాయణన్ ఒఎస్‌డి ఎస్‌ఎన్.సాహు తెలిపారు. అనంతపురంలో రెండు రోజులుగా జరుగుతున్న మానవ హక్కుల వేదిక 10వ రాష్ట్ర మహాసభ ఆదివారంతో ముగిసింది. యాపిల్ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ మహాసభలో రెండో రోజు మూడు అంశాలపై సదస్సు జరిగింది. ‘కుల గణన ఎందుకు అవసరం’ అన్న అంశంపై సాహు ప్రసంగిస్తూ దేశంలో ఇప్పటికీ వివక్ష పూరిత సమాజం ఉందని తెలిపారు. మాజీ రాష్ట్రపతి కెఆర్.నారాయణన్ వంటి వారు కూడా ఈ వివక్షను ఎదుర్కొన్న వారేనన్నారు. ఈ కులవివక్ష రూపాలను సరిగా అర్థం చేసుకోవాలంటే కులగణన జరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. మొదటిసారి కేరళలో ముఖ్యమంత్రిగా నంబూద్రీపాద్ బాధ్యతలు చేపట్టాక అక్కడ కులగణన చేయించారని గుర్తు చేశారు. వివక్ష అన్నది ఒక్క హిందూమతంలోనే కాదని, ఇతర మతాల్లోనూ ఉందని ఆ సర్వేలో స్పష్టమైందన్నారు. ‘బస్తర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై స్వతంత్ర జర్నలిస్టు మాలిని సుబ్రమణ్యం మాట్లాడుతూ బస్తర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్చగా సాగుతోందని విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీలకు అడవుల్లో ఉన్న విలువైన ఖనిజాన్ని కట్టబెట్టేందుకు ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. గత నెల నవంబరులో 47 మంది అమాయక గిరిజన మహిళలను ఎటువంటి కారణం లేకుండా వారం రోజులపాటు భద్రతా బలగాలు నిర్బంధంలో ఉంచాయని తెలిపారు. ఇక్కడి విషయాలు బయటకు పొక్కకుండా మీడియాను నియంత్రించే ప్రయత్నాలు సాగుతు న్నాయని వివరించారు. నూతన విద్యా విధానంపై రచయిత కొప్పర్తి వెంకట రమణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ప్రయివేటీకరణను ప్రోత్సహిం చేదిగా ఉందని తెలిపారు. అదే విధంగా పాఠ్యాంశాలను మార్చి కాషాయీకరణ చేసే చర్యలు అందులో ఉన్నాయని పేర్కొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
మానవ హక్కుల వేదిక ఎపి రాష్ట్ర అధ్యక్షుడిగా కెవి.జగన్నాథరావు, ప్రధాన కార్యదర్శిగా వై.రాజేష్, ఉపాధ్యక్షులుగా యుజి.శ్రీనివాసులు, ఎ.రవి, జి.శివనాగేశ్వరరావు, ఎస్.అబ్దుల్ రసూల్, ఎం.శరత్, కార్యదర్శులుగా యుఎం.దేవేంద్రబాబు, బిఎన్.సుబ్బన్న, జి.రోహిత్‌ను ఎన్నుకున్నారు. తెలంగాణ కమిటీ అధ్యక్షులుగా భుజంగరావు, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ తిరుపతి, రెండు రాష్ట్రాల సమన్వయకర్తలుగా ఎస్.జీవన్‌కుమార్, వసంతలక్ష్మి, ఎ.చంద్రశేఖర్, విఎస్.కృష్ణలను ఎన్నుకున్నారు.