ప్రజాశక్తి-పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని చెంచుగూడేలలో ఇప్పటికే సుమారు 956 చెంచు కుటుంబాలకు విద్యుత్తు కనెక్షన్లను ఇచ్చామని, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్న మరో 611 చెంచు కుటుంబాలకూ త్వరలోనే సోలార్ విద్యుత్తు అందిస్తామని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసిన యర్రగొండపాలెం పరిసర ప్రాంతాల్లోని చెంచు గూడేలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయం చేసే చెంచులకు మరింత వెసులుబాటు కోసం వారి పొలాల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. చెంచులకు ఆర్థిక చేయూత సాధించేలా ఎన్‌ఆర్‌ఇజిఎస్, పనికి ఆహార పథకంలో భాగంగా… ఇకపై వారికి కూడా పని దినాలను కేటాయిస్తామని తెలిపారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లానని.., దీనిపై సిఎం కూడా సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎరిక్షన్‌బాబు పాల్గొన్నారు.