- రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌పి సిసోడియ
ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్ : రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌పి సిసోడియ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండల పరిధిలోని జగరాజుపల్లి గ్రామంలో రీ సర్వే పనులను గురువారం ఆయన పరిశీలించారు. జగరాజుపల్లి గ్రామాన్ని ఈ సర్వే కోసం మోడల్ విలేజ్‌గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆ గ్రామంలో పర్యటించి సర్వేనెంబర్ 73, బ్లాక్ నెంబర్ 3లోని 200 ఎకరాల భూమి సర్వే పక్రియను కలెక్టర్ టిఎస్ చేతన్‌తో కలిసి పరిశీలించారు. రీ సర్వేకు సంబంధించి రైతు చిన్నపరెడ్డి భూమి పరిధిలో 15 మంది రైతులు కలిపి ఉన్నారని కార్యదర్శికి మండల రెవెన్యూ అధికారులు వివరించారు. రీసర్వే అనంతరం రైతుల భూములుకు హద్దులు ఏర్పాటు చేసేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రీసర్వేతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. పొలాల హద్దులను సరిచూసుకోవడమే కాక, అన్నదమ్ములు, ఇతరుల మధ్య ఉన్న భూ సమస్యలు సైతం నివృత్తి చేసుకోవచ్చని, భూ హక్కు ఏర్పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్‌డిఒ సువర్ణ, ఎడి సర్వేయర్ పి విజయశాంతి బాయి, రైతులు పాల్గొన్నారు.