డెల్టా ఆధునీకరణతో ముంపు సమస్యకు పరిష్కారం

  • మంత్రి నిమ్మల రామానాయుడు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : డెల్టాల ఆధునీకరణ ద్వారా రాష్ట్రంలో జల వనరులను సద్వినియోగం చేసుకోవడంతోపాటు ముంపు సమస్యను పరిష్కరించుకోవచ్చని జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కాలువలు, చెరువుల్లో ఆక్రమణలు, శివారు భూములకు నీరు అందకపోడం, పైనున్న భూములు ముంపునకు గురవడం వంటి సమస్యలపై బుధవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా,గోదావరి బేసిన్లోని మురుగునీరు దాదాపు కోల్లేరు లోకే వస్తున్నాయని, ఇది ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్లాల్సి ఉన్నా ఆక్రమణలతో నిలిచిపోతోందని తెలిపారు. మొత్తం డెల్టా ప్రాంతం అంతా ఇదే సమస్యగా ఉందని వివరించారు. డ్రెయిన్లు పూడిక తీయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై ప్రణాళికలు తయారు చేయాలని సిఎం కూడా చెప్పారని వివరించారు. లస్కర్ల సంఖ్య కూడా తక్కువగా ఉందని, వారిని కూడా నియమించుకుంటామని తెలిపారు. సాగునీటి సంఘాలతో మంచి ఫలితాలు వస్తున్నాయని వివరించారు.

హంద్రీనీవా పూర్తే లక్ష్యం

రాయలసీమ పరిధిలోని హంద్రీ నీవా సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రామానాయుడు చెప్పారు. గతంలో జగన్‌ రాయలసీమనుండి ముఖ్యమంత్రిగా ఉండి పనులు చేయకుండా సీమ ద్రోహిగా మిగిలిపోయాడని అన్నారు. రాష్ట్ర బడెట్లో రూ.3,243 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఈ ప్రాంత రైతులు వారి సమస్యల పరిష్కారం కోసం తాడేపల్లిలోని జగన్‌ప్యాలస్‌ ముందు ధర్నా చేయాలని తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులకు నీరందించేందుకు రూ.864 కోట్లతో ఒప్పందం చేసుకున్న వైసిపి ప్రభుత్వం ఒక్కపని కూడా చేయలేదని తెలిపారు. పైపులు తీసుకొచ్చి రూ.200 కోట్లు బిల్లులు మాత్రం వసూలు చేశారని అన్నారు.

➡️