- ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్‌టిఆర్ వైద్యసేవలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు సిఎం చంద్రబాబుకు మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ఏళ్లుగా 2,400 మంది ఆరోగ్యమిత్ర (వైద్యమిత్ర)లు నెలకు రూ.15 వేలు వేతనంతో పనిచేస్తున్నారని తెలిపారు. పట్టభద్రులు, పోస్టు గ్రాడ్యుయేట్లు, డిఇడి అసిస్టెంట్ కేడర్లతో సమానమైన పనులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అయినా అవుట్‌సోర్సింగ్‌లో క్లాస్-4 ఉద్యోగులకు చెల్లించే వేతనాలను మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. దీనిపై ఆరోగ్యమిత్రల సంఘాలతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అధికారులు చర్చించి పరిష్కరిస్తామని హామీనిచ్చారని తెలిపారు. నేటికీ సమస్యలు పరిష్కరించబడలేదని వివరించారు. వారి సమస్యలను పరిగణనలోకి తీసుకుని వైద్యమిత్రలను కాంట్రాక్టు పద్ధతిలోకి మార్పుచేసి, చేస్తున్న పనిని బట్టి కేటగిరి-1గా మార్చి వేతనాలు పెంచాలని కోరారు. హెచ్‌ఆర్ పాలసీ వర్తింపజేయాలని, వైద్యమిత్రలను కొనసాగించి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.