వరద బాధితుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి

ప్రజాశక్తి – విజయవాడ : వరదల వలన నష్టపోయిన ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.సృజనకు సిపిఎం నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు సిపిఎం నేతలు కలిసి వినతిపత్రం ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలతో ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ నగర ప్రజలకు ఎన్నడూ లేనంత నష్టం వాటిల్లిందని, ప్రభుత్వ ఉపశమన చర్యలు అందరికీ సక్రమంగా అందలేదని, ఎన్యుమరేషన్‌ కూడా సమగ్రంగా జరగని స్థితిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. అందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధితులు తమ సమస్యలు చెప్పుకోవడానికి, ఫిర్యాదు చేసుకోవడానికి కేంద్రాలను ప్రకటించి, సమస్యలు పరిశీలించి పరిష్కరించాలని కోరారు. పది రోజులు బయటకు రాలేని స్థితిలో చిరుద్యోగులు అనేక మంది ఉద్యోగాలకు వెళ్లలేదని, ఉద్యోగాలకు రాలేదనే పేరుతో మెమోలు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. వరదల వల్ల అధికంగా నష్టపోయిన గ్రామాలను, పంటలను ప్రత్యక్షంగా గుర్తించి వారికి ప్రత్యేక ప్యాకేజీగా హెక్టార్‌కు రూ.50వేలు పరిహారం ఇవ్వాలని, కౌలు రైతులకు నేరుగా పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికలకు రూ.ఐదు వేలు సహాయం అందించాలని, చెడిపోయిన మోటార్లకు ఉచితంగా రిపేర్లు చేయించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, కె.శ్రీదేవి, పి.వి.ఆంజనేయులు, ఎన్‌.సి.హెచ్‌. శ్రీనివాసు, కోటా కళ్యాణ్‌, బి.సత్యబాబు, ఎం.నాగేంద్రప్రసాద్‌ ఉన్నారు.

➡️