సర్వేయర్ల సమస్యలు పరిష్కరించండి

 గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అర్హులైన సర్వేయర్లకు శాఖాపరమైన పరీక్షలు నిర్వహించి, పదోన్నతులు కల్పించాలని గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బూరా మధుబాబు కోరారు. గ్రామ సర్వేయర్లు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వియజవాడలోని ధర్నా చౌక్‌లో ధర్నా కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ… భూముల సర్వేకు అవసరమైన ల్యాప్‌ట్యాప్‌లు, ప్రింటర్లు, స్టేషనరీ ప్రభుత్వం సమకూర్చడం లేదన్నారు. మండలంలో సుమారు 15 మంది సర్వేయర్లకు ఒక ల్యాప్‌ట్యాప్‌ మాత్రమే ఇచ్చారని దీంతో సర్వే పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొందన్నారు. సచివాలయాలను క్రమబద్ధీకరించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,801 గ్రామ సర్వేయర్లకు, 5079 మందిని సచివాలయాల్లో ఉపయోగించుకుని మిగిలిన 4,722 మందిని ఇతర శాఖల్లో సర్ధుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, టెన్నికల్‌ నైపుణ్యం కలిగిన వీరిని అటువంటి శాఖల్లోనే సర్ధుబాటు చేయాలని కోరారు. గ్రామ సర్వేయర్లు సర్వే చేసి ఇచ్చిన నివేదికలపై విఆర్వోలు సంతకాలు చేయడం లేదన్నారు. అందువల్ల రీ సర్వేలో విఆర్వోలను భాగస్వాములు చేయాలని కోరారు. ఎస్‌ఒపిలో ఉన్న ప్రొసీజర్‌ను అమలు చేయడం లేదన్నారు. రీ సర్వే డిప్యూటీ తహశీల్దారులు (ఆర్‌ఎస్‌డిటి) ఉన్న భూ తగాదాలను పరిష్కరించకుండా కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నారని తెలిపారు. వీరు భూ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం లేదని చెప్పారు. గ్రామ సర్వేయర్లు అధికారికంగా సెలవు తీసుకున్నా, పంచాయతీ కార్యదర్శులు, తహశీల్ధారులు, మండల సర్వేయర్లు బలవంతంగా పని చేయించుకుంటున్నారని తెలిపారు. సంఘం విజయవాడ నగర అధ్యక్షులు కార్తీక్‌ మాట్లాడుతూ… గ్రామ సర్వేయర్లపై రెవెన్యూ అధికారుల అజమాయిషీ తగ్గించాలన్నారు. టైం స్కేల్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు అయ్యప్పల నాయుడు, అంకయ్య, ఓంకార్‌, జిల్లా నాయకులు లోకేష్‌, శ్రీనివాస్‌, సాయికిరణ్‌ తదితరులు పాల్గన్నారు.

➡️