ఎపి బిజెపి ఎమ్మెల్సీగా సోము వీర్రాజు ఖరారు

Mar 10,2025 11:49 #AP BJP MLC, #confirmed, #Somu Veerraju

అమరావతి : ఎపి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని బిజెపి అధిష్టానం ప్రకటించింది. ఎపి బిజెపి మాజీ చీఫ్‌ సోము వీర్రాజు పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ … సోమవారం బిజెపి అధికారికంగా ప్రకటించింది. నామినేషన్‌ దాఖలు చేయడానికి ఈరోజే చివరి తేదీ కావడంతో మరి కాసేపట్లో ఆయన నామినేషన్‌ వేయనున్నారు. 2025, మార్చి 29న ఎపిలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఐదు స్థానాలకు మార్చి 20 న ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. ప్రస్తుత ఎపి అసెంబ్లీ బలాబలాల ప్రకారం … ఐదు స్థానాలు టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వానికి దక్కనున్నాయి. కూటమి పొత్తులో భాగంగా జనసేన, బిజెపి కి చెరొక ఎమ్మెల్సీ సీటును టిడిపి ఇచ్చింది. మిగిలిన మూడు స్థానాలకు టిడిపి ఆదివారం తమ అభ్యర్థులను ప్రకటించింది. జనసేన ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ఖరారు చేసింది. జనసేన చీఫ్‌, డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌ సోదరుడు కొణిదెల నాగబాబుకు జనసేన అవకాశం కల్పించింది. కూటమి పొత్తులో భాగంగా వచ్చిన ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల చివరి రోజు బిజెపి అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్‌ నేత సోము వీర్రాజును ప్రకటించింది. నామినేషన్ల దాఖలు చేసేందుకు సోమవారమే చివరి రోజు కావడంతో మూడు పార్టీల నేతలు నేడు నామినేషన్లు సమర్పించనున్నారు. సంఖ్యా బలం లేకపోవడంతో పోటీకి ప్రతిపక్ష వైసిపి దూరంగా ఉండటంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

➡️