- ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లు అందజేత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సినీ నటుడు, ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకులు సోనూసూద్ సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ తరపున నాలుగు ఎమర్జెన్సీ లైఫ్‌సేవింగ్ కోసం అంబులెన్స్‌లు ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తరలించేందుకు సూదూర ప్రాంతాల్లో క్లిష్టమైన వైద్యసేవలందించేందుకు వీలుగా అంబులెన్స్‌లు ఇచ్చిన సోనూసూద్‌ను సిఎం చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం అత్యవసన వైద్య చికిత్సలు, అత్యాధునిక సౌకర్యాలతో వైద్యం అందేలా ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని సిఎం తెలిపారు. ఈ ఆశయంలో ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ భాగస్వామి కావడం పట్ల సిఎం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సోనూసూద్ మాట్లాడుతూ.. సామాన్యుల కోసం తన ఫౌండేషన్ పనిచేస్తుందని, ఎపి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు తాను సిద్ధమని ఆయన పేర్కొన్నారు. తాము అందించిన అంబులెన్స్‌లతో ఆపదలో ఉన్నవారికి భరోసా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన సతీమణి ఆంధ్రాకు చెందిన వారేనని, కోవిడ్ సమయంలోనే ప్రజలను ఆదుకోవాలన్న నా బాధ్యత మొదలైందన్నారు. సమాజానికి మేలు చేయాలనే విషయంలో సిఎం చంద్రబాబు చాలా మందికి స్ఫూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్‌టి కృష్ణబాబు పాల్గొన్నారు.