చర్లపల్లి – విశాఖకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు శుక్రవారం రైల్వేశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఉత్తరాంధ్రకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య అత్యధికంగా ఉండటంతో ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు సరిపోవడం లేదు. ఈ మేరకు జనసదరన్‌ రైలు (08534) చర్లపల్లి నుంచి విశాఖపట్నంకు ఈ నెల 11, 13, 16, 18వ తేదీల్లో నడవనుంది. విశాఖపట్నం నుంచి చర్లపల్లికి (ట్రైన్‌ నెంబరు 08533) ఈ నెల 10, 12, 15, 17 తేదీల్లో జనసదరన్‌ రైలు నడవనుంది. విశాఖపట్నంలో బయలుదేరే రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో రిజర్వేషన్‌ సౌకర్యం ఉండదని, నాన్‌ రిజర్వేషన్‌ ట్రైన్‌గా మాత్రమే నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ప్రత్యేక రైళ్లు చర్లపల్లిలో ఉదయం 10 గంటలకు బయలుదేరి, రాత్రి 12 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని తెలిపింది.

‘వందే భారత్‌’లో 4 కోచ్‌లు పెంపు

విశాఖపట్నం – సికింద్రాబాద్‌ మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో నాలుగు కోచ్‌లు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఇప్పటి వరకు 16 కోచ్‌లతో నడిచిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు 20 కోచ్‌లతో నడవనుంది. అదనపు కోచ్‌లతో ఒకేసారి 1,414 మంది ప్యాసింజర్లు ప్రయాణించే అవకాశం కలుగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

➡️